గతంలో కెసిఆర్, గవర్నర్ లకు నీతులు చెప్పిన చంద్రబాబు ఇపుడు అదే ఫిరాయింపులకు పెద్ద పీట వేయటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు?

చంద్రబాబునాయుడు రూటే సపరేటు. తాను చేస్తే సంసారం, ఎదుటివారు, గిట్టనివారు చేస్తే వ్యభిచారం అని నిస్సిగ్గుగా చెప్పగలరు. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయ్. ఫిరాయింపులు, అవినీతి లాంటివి ఎన్నో ఉన్నాయి. తెలంగాణాలో టిడిపి తరపున గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ కు కెసిఆర్ మంత్రిపదవి ఇస్తే చంద్రబాబు, టిడిపి నేతలు చేసిన గోల అంతా ఇంతా కాదు. అక్కడి ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో నానా యాగీ చేసారు. అలాంటిది ప్రస్తుతం ఏకంగా నలుగురు ఫిరాయింపులకు మంత్రిపదవులు కట్టబెట్టారు.

పార్టీలో ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, అభ్యతరాలు వ్యక్తంచేసినా లెక్కచేయకుండా వైసీపీలో గెలిచిన భూమా అఖిలప్రియ, ఆది నారాయణరెడ్డి, ఎన్. అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులను మంత్రివర్గంలో చోటు కల్పించారు. కెసిఆర్, గవర్నర్ కు నీతీలు చెప్పిన చంద్రబాబు ఇపుడు అదే ఫిరాయింపులకు పెద్ద పీట వేయటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు?

ఇక, అవినీతి విషయం చూస్తే మంత్రుల్లో అనేక మందిపై అవినీతి ఆరోపణలున్నాయి. అయితే, వారందిరినీ పక్కనబెట్టి అనారోగ్యం, అవినీతి కారణాలుగా చూపి ఒక్క బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మాత్రమే తొలగించారు. పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి, కిమిడి మృణాళిని తొలగింపుకు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. కెఇ కృష్ణమూర్తి, నారాయణ, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర్ రావు తదితరులపై అనేక అవినీతి ఆరోపణలున్నాయ్. మరి వారిని కొనసాగించటంలో చంద్రబాబు ఏ ప్రాతిపదికను అనుసరించారో ఆయనే చెప్పాలి.