Asianet News TeluguAsianet News Telugu

తండ్రి వైఎస్సార్ బాటలోనే జగన్...: యనమల రామకృష్ణుడు

కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లపై వైసిపి శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Big Scam In YCP House sites distribution Scheme: yanamala ramakrishnudu
Author
Guntur, First Published Jul 10, 2020, 10:51 AM IST

గుంటూరు: కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లపై వైసిపి శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.  శ్వేతపత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ? 3నెలల క్రితమే కౌన్సిల్ లో చేసిన డిమాండ్ పై ఎందుకు స్పందించరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిధుల దారిమళ్లింపుపై ప్రజల్లో అనుమానాలు నివృతి చేయాలని యనమల పేర్కొన్నారు. 

''కేంద్ర నిధుల వినియోగంపైఏప్రిల్ లోనే కౌన్సిల్ లో డిమాండ్ చేసినా 4నెలలుగా పెడచెవిన పెట్టారు. సక్రమంగా నిధుల వినియోగం లేదనేది ఇక్కడే తేలిపోతోంది. 
గత 13నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు వచ్చాయి. డివల్యూషన్ కింద, గ్రాంట్ ఇన్ ఎయిడ్  కింద, కోవిడ్ 19ప్రత్యేక గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 40% చొప్పున, నరేగాలో 10% చొప్పున నిధులు పుష్కలంగా వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎందుకని దాచిపెడుతున్నారు..?'' అని ప్రశ్నించారు. 

''కరోనా లాక్ డౌన్ తర్వాత రూ.8వేల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వచ్చిన నిధులు ఏం చేశారు, వేటికి మళ్లించారు అనేదానిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. శ్వేతపత్రం ద్వారా వాటిని బహిర్గతం చేయాలని కోరితే ఎందుకు వెనక్కి పోతున్నారు. డివల్యూషన్స్ మినహా మిగిలిన కేంద్ర నిధుల్లో దారిమళ్లించింది ఎంత..? వీటన్నింటిపై ప్రజలకు జవాబివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది'' అని అన్నారు. 

''ఏడాది వైసిపి పాలనలో ప్రజలకు చేసింది శూన్యం, రాష్ట్రానికి అదనంగా ఒరగబెట్టిందేమీ లేదు. టిడిపి హయాంలో రాష్ట్రానికి వచ్చిన మంచిపేరు చెడగొట్టారు. దేశవిదేశాల్లో ఏపికి చెడ్డపేరు తేవడమే వైసిపి సాధించిన ఘనత'' అని మండిపడ్డారు.

read more  మోదీకి రఘురామ కృష్ణం రాజు మరో లేఖ

''పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, పక్కాఇళ్ల నిర్మాణం 40ఏళ్లుగా చేస్తున్నదే. పేదలకు పట్టాలుగాని, పక్కాఇళ్ల నిర్మాణం గాని కొత్త పథకాలు కాదు. 4దశాబ్దాలుగా అమల్లో ఉన్న పథకాలకు జగన్ పేరు పెట్టుకోవడం హాస్యాస్పదం. ఇందిరాగాంధీ హయాంలో రూ.500 తో తాటాకుల ఇళ్ల నిర్మాణం చేశారు.  ఎన్టీఆర్ వచ్చాకే పేదవారికి కాంక్రీట్ శ్లాబ్ భవనాల నిర్మాణం ప్రారంభమైంది. బిసిలకు, ఈబిసిలకు పక్కాఇళ్లు అందించింది ఎన్టీఆర్. పక్కా ఇళ్ల నిర్మాణంలో వినూత్న మార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే'' అని గుర్తుచేశారు. 

''ఎన్టీఆర్ కృషిని చంద్రబాబు కొనసాగించారు.  5ఏళ్లలో 10లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తిచేశారు. అన్నికులాల వారు ఒకేచోట కలిసి మెలిసి జీవించడం అనే అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబే'' అని తెలిపారు. 

''2004-09మధ్య ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ లో పెద్దఎత్తున కుంభకోణాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పిచ్చుకల గూళ్లలాంటి ఇళ్లు నిర్మించారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారు. 14లక్షల ఇళ్లు భూమ్మీద కనిపించలేదు, 13జిల్లాలలోనే రూ5వేల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు కూడా అప్పట్లో జరిగింది, వందమంది అధికారులపై క్రిమినల్ కేసులకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. 75మందిని సస్పెండ్ చేశారు, 12మందిని సర్వీసునుంచి తొలగించారు. మళ్లీ ఇప్పుడు వైసిపి పాలనలో పెద్దఎత్తున హౌసింగ్ స్కామ్ లకు తెరదీశారు'' అని ఆరోపించారు. 

''భూసేకరణలో అవినీతి, మెరక వేయడంలో అవినీతి, లబ్దిదారుల ఎంపికలో అవినీతికి పాల్పడుతున్నారు. ఎకరం రూ.5లక్షలు చేయని భూమిని రూ.50లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి మిగిలిన మొత్తాన్ని వైసిపి నాయకులే వాటాలు వేసుకుని పంచుకున్నారని ఆ పార్టీ వాళ్లే బైటపెట్టారు. భూసేకరణకు విడుదల చేసిన రూ.8వేల కోట్లలో సగం స్వాహా చేశారనేది మీడియా కథనాలే వెల్లడించాయి. మెరక వేయడంలో రూ.1,560కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిధులు కొల్లగొట్టేందుకే కావాలని 14అడుగుల పల్లపు ప్రాంతాలైన ఆవభూములను నివాస స్థలాలకు ఎంపిక చేశారు'' అని అన్నారు. 

''స్మశానంలో, అడవుల్లో, పల్లపు భూముల్లో ఇళ్లస్థలాలు ఇస్తున్న ఘనత సీఎం జగన్ రెడ్డిదే. ఇప్పుడీ ఇళ్లస్థలాల్లో అవినీతి చూస్తుంటే 2004-09మధ్య హౌసింగ్ కుంభకోణం గుర్తొస్తోంది. ఇళ్ల స్థలాల లబ్దిదారుల ఎంపికలో బలవంతపు వసూళ్లు గర్హనీయం. పట్టాకు రూ.30వేల నుంచి రూ.60వేల చొప్పును వసూళ్లు చేస్తున్నారని వైసిపి నాయకులే ఫిర్యాదులు చేయడం ఇళ్లపట్టాల్లో అవినీతికి ప్రత్యక్ష సాక్ష్యం'' అని తెలిపారు.

''పేదలకు కూడు-గూడు-దుస్తులకు ఎటువంటి లోపం జరగకూడదనే సదాశయం టిడిపిది అయితే పేదల కూడు-గూడులో కూడా అవినీతికి పాల్పడే దుష్ట చరిత్ర వైసిపిది. పేదలను మోసం చేస్తే పతనమే అనేది వైసిపి నాయకులు గుర్తుంచుకోవాలి''  అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios