Asianet News TeluguAsianet News Telugu

ఫారిన్ కరెన్సీ విషయంలో టీటీడీకి ఊరట.. బ్యాంక్‌ల్లో డిపాజిట్‌కు కేంద్రం ఓకే

విదేశీ కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి కేంద్ర హోంశాఖ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనుమతించింది. టీటీడీ ఈవోకు శుక్రవారం కేంద్రం సమాచారం ఇచ్చింది. 

big relief for ttd for foreign currency deposits ksp
Author
First Published Apr 21, 2023, 6:52 PM IST

విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఊరట లభించింది. విదేశీ కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి కేంద్ర హోంశాఖ అనుమతించింది. విదేశీ దాతలు, లేదా భక్తుల వివరాలు లేకపోయినా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మినహాయింపును ఇస్తున్నట్లు..టీటీడీ ఈవోకు శుక్రవారం కేంద్రం సమాచారం ఇచ్చింది. 

కాగా.. గత నెలలో టీటీడీకి కేంద్రం భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించింది. లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది. లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించలేదు. 

Also Read: టీటీడీకి రూ.4.33 కోట్ల భారీ జరిమానా విధించిన కేంద్రం.. జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌తో వెలుగులోకి..

శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదు. తరచూ భారీ మొత్తాల్లో అజ్ఞాత భక్తులు నగదు వేస్తుంటారు. అదే సమయంలో విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు సైతం తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుంది. గతంలో ఆ విదేశీ నగదును ఆర్‌బీఐ ద్వారా టీటీడీ మన కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. దానికి తోడు విదేశీ కరెన్సీని ఎస్‌బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ చేయడానికీ ఒప్పుకోవడం లేదు. ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకూ సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది.

టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే.. 
కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్‌ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించామని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విదేశీ కరెన్సీని విరాళాలుగా స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును 2018కి ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేశారన్నారు. ఈ ఐదేళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని.. ఈ నగదు మార్పిడి కోసం ప్రయత్నించగా, ఈ నగదు ఎవరిచ్చారు.. ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని తెలిపారు. గుర్తుతెలియని భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios