చంద్రబాబు "మనసులో మాట".. అశ్లీల సాహిత్యమా: భూమన

bhumana karunakar reddy comments on chandrababu naidu
Highlights

చంద్రబాబు "మనసులో మాట".. అశ్లీల సాహిత్యమా: భూమన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. నాలుగేళ్లు కేంద్రంలో ఉండి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని.. విభజన హామీలపై వైసీపీ పోరాటం చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుందోని ఆరోపించారు. అప్పుడు కేంద్రం అన్ని చేసేస్తొందని ప్రచారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందంటూ డ్రామాలాడుతున్నారని భూమన ఎద్దేవా చేశారు.

రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ, పెట్రో కాంప్లెక్స్, చెన్నై విశాఖ కారిడార్ ఆరు నెలల్లో పూర్తి చేయాలని కానీ ఇంతవరకు ఎలాంటి ముందడుగు లేదన్నారు. కడపలో మొన్న చేసిన సురభి నాటకం లాగానే ఇప్పుడు జోన్ కోసం మాట్లాడుతున్నారని.. ప్రజల అవసరాలను తనకు అనుకూలంగా మలుచుకునే నీచపు రాజకీయ ఎత్తుగడ చంద్రబాబుదని ఆరోపించారు.

600 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని.. ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్‌సైట్ నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని కరపత్రాలు ముద్రిస్తూ.. ఇచ్చిన హామీలను మాత్రం ఎందుకు తొలగించారని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. హామీలు నెరవేర్చలేదని మేం నిరూపిస్తాం.. మీరు చర్చకు సిద్ధమా అని సవాల్  విసిరారు.

చంద్రబాబు రాసిన ‘మనసులో మాట’ అశ్లీల సాహిత్యమా..? ఎందుకు అందుబాటులో లేకుండా చేశారని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్లు దాచుకున్నారు.. దేశం మొత్తం టీడీపీ పెద్ద  గజదొంగ పార్టీ అని తెలిసిపోయింది. 25 మంది ఎంపీలను ఇస్తే సాధిస్తామంటున్నారు.. ఇప్పుడు 20 మంది ఉన్నారు ఏం చేశారని ప్రశ్నించారు.

అవినీతి సొమ్ముతో చంద్రబాబు కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని భూమన ఆరోపించారు. దీక్షతో 5 కేజీలు తగ్గాలని అనుకున్నవారు.. ఇప్పుడు నిరాహారదీక్ష చేయడం వారి చతురతకు నిదర్శనమన్నారు.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

loader