హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాదులోని కిషన్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అఖిలప్రియ బిజెపి తీర్థం పుచ్చుకుంటారని లేదా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. 

తాజాగా కేంద్ర మంత్రి, బిజెపి నేత కిషన్ రెడ్డితో భేటీ కావడంతో అఖిల ప్రియ బిజెపి వైపు చూస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి టీడీపీ నేతలకు గాలం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డితో అఖిలప్రియ భేటీ జరిగింది.

కాగా, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుల గురించి అఖిలప్రియ కిషన్ రెడ్డికి వివరించినట్లు చెబుతున్నారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

కర్నూలులో రాజకీయ దాడులు చేస్తున్నారని అఖిలప్రియ కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫాక్షన్ గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.