బెజవాడ కోర్టు సిబ్బంది నిర్లక్ష్యం.. చెత్త బుట్టలో న్యాయవాదులు దాఖలు చేసిన కాగితాలు...
విజయవాడలో కోర్టు సిబ్బంది నిర్లక్ష్యం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. వివిధ కేసుల నిమిత్తం కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాలు చెత్తబుట్టలో కనిపించాయి.
విజయవాడ : బెజవాడలో కోర్టు సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కోర్టులో వివిధ కేసుల కోసం న్యాయవాదులు దాఖలు చేసిన కాగితాలను కోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా చెత్త బుట్టలో పడేశారు. ఇది వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. చెత్తబుట్టలో పడేసిన కాగితాలకు తాలూకు ఫోటోలు వెలుగులోకి రావడంతో ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. అందరూ దీనిమీద చర్చించుకుంటున్నారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి.. అంటూ మాట్లాడుకుంటున్నారు.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం బాధితుల్ని భయపెడుతోంది. వివిధ కేసుల్లో తమ క్లయింట్స్ కు సంబంధించిన వివరాలను కోర్టుకు న్యాయవాదులు కాగితాలు సమర్పిస్తుంటారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు తగిన విధంగా పరిష్కారం చేస్తుంటారు. అయితే న్యాయవాదులు దాఖలు చేసిన కాగితాలు న్యాయాధికారి దాకా చేరకముందే ఇలా బుట్ట దాఖలు కావడంతో అందర్నీ షాక్ కు గురి చేస్తోంది.