కేవలం ఐదు రూపాయల కోసం ఓ భిచ్చగాడు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. తాను భిక్ష అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాగా తెలిసిన వ్యక్తినే ఆ యాచకుడు అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం మంగళవారం పట్టపగలు నడిరోడ్డుపైనే చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో అశోక్ బాబు అనే వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. మతిస్థిమితం సరిగ్గా లేని ఇతడు రైతుబజార్, బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ రైతులు,ప్రయాణికులు, వ్యాపారుల వద్ద డబ్బులు యాచిస్తుండేవాడు. ఇలా రోజూ మాదిరిగానే  మంగళవారం కూడా అతడు బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులను డబ్బుల కోసం యాచిస్తున్నాడు. 

ఈ క్రమంలో బస్టాండ్ పక్కనే వుండే పళ్ల వ్యాపారి కొండబాబును ఐదు రూపాయలు ఇవ్వాల్సిందిగా అడిగాడు. అయితే ఎంతివ్వాలో కూడా అతడే నిర్ణయించి డిమాండ్ చేయడంతో కొండబాబు భిచ్చగాడిపై కోపాన్ని ప్రదర్శించాడు. దీంతో సదరు యాచకుడు కూడా వ్యాపారిపై దూషణకు దిగాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

ఇద్దరు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో యాచకుడు వ్యాపారిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇలా పట్టపగలే అందరూ చూస్తుండగానే గొడవ జరుగుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో అశోక్ బాబు మరింత రెచ్చిపోయి కొండబాబు సున్నితమైన అవయవాలపై దాడికి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. 

ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరిని కొండబాబు ప్రాణాలు కోల్పోయి పడివున్నాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఈ హత్యకు కారణమైన యాచకుడిని అరెస్ట్ చేశారు. మృతిడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.