అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం సీఎం జగన్ ను కలిసిన కృష్ణయ్య సుమారు అరగంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. 

బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఇప్పటికే బీసీల రిజర్వేషన్ కు సంబంధించి గతంలో లేఖ సైతం రాశారు. అంతేకాదు ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఫిబ్రవరి 17న జరిగిన వైసీపీ బీసీ శంఖారావం కార్యక్రమంలో కూడా ఆర్ కృష్ణయ్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు లోటస్ పాండ్ లో కలిసి బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి జగన్ ను కలవడం ఇదే ప్రథమం.