తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. అయితే తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. అయితే తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘నువ్వు వస్తే పథకాలు రద్దు.. నువ్వు వస్తే వెన్నుపోట్లు’’ అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల పక్కనే.. వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే చంద్రబాబు కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ శ్రేణులు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చేరుకున్న చంద్రబాబు భారీ రోడ్ షోను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందనీ, తరతరాలుగా కోలుకోలేని విధంగా ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. రాష్ట్ర వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ఏకమై ధైర్యంగా రోడ్లపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసులు, అణచివేతలకు భయపడి మౌనంగా ఉంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. 2014-19 మధ్య ఐదేళ్లలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు, ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. తాను పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని 23 సార్లు సందర్శించాననీ, పోలవరం ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా నిర్మించామని ఆయన చెప్పారు.
జగన్ రెడ్డి పాలనలో పోలవరం భ్రష్టుపట్టిందనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రం గోడ కొట్టుకుపోయిందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల 70 ఏళ్ల కల. జగన్ ప్రభుత్వం ఆ కలను బహుళార్థసాధక ప్రాజెక్టుగా మార్చడానికి బదులుగా బ్యారేజీగా కుదించి నాశనం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ రంగాన్ని వదిలిపెట్టలేదనీ, తన అత్యాశ, అహంకారానికి సర్వస్వం త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. తరిమికొట్టడం సులభం, తీసుకురావడం కష్టమని, నిర్మించడం కష్టమని, కూల్చివేయడం సులభమని ఫైర్ అయ్యారు.