విశాఖపట్టణం: బ్యాంకు రుణం ఎగవేత కేసులో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంకు యాజమాన్యం రంగం సిద్దం చేసింది.

ప్రత్యూష కంపెనీ కోసం గంటా శ్రీనివాసరావు ఇండియన్ బ్యాంకు నుండి రుణం తీసుకొన్నాడు. వడ్డీతో కలుపుకొని రుణం రూ. 248.09 కోట్లకు చేరుకొంది. ఈ రుణం చెల్లించాలని ఇండియన్ బ్యాంకు యాజమాన్యం ప్రత్యూష కంపెనీని కోరింది. 

కానీ రుణం చెల్లించేందుకు కంపెనీ ముందుకు రాకపోవడంతో రుణం తీసుకొనేందుకు బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంకు నిర్ణయం తీసుకొంది.

ఈ నెల 25వ తేదీన ఆస్తులను వేలం వేసేందుకు గాను ఈ ఆక్షన్  సేల్ నోటీసును ఇండియన్ బ్యాంక్ జారీ చేసింది.ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ ఫ్రా కంపెనీ గతంలో రూ. 141.68 కోట్లను ఇండియన్ బ్యాంకు కు బకాయి పడింది.  

ఈ బకాయి చెల్లించాలని ఇండియన్ బ్యాంకు 2016, అక్టోబర్ 4వ తేదీన నోటీసులు పంపింది.ఈ రుణం చెల్లించడానికి కంపెనీ చేతులేత్తేసింది. అయితే  అసలు ,వడ్డీ కలుపుకొని రూ. 248.03 కోట్లకు చేరుకొంది. దీంతో ప్రత్యూష గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకొంది.

రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రమణ్యం, ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ లిమిటెడ్ సంస్థల పేర్లను ఈ ఆక్షన్ నోటీసులో ఇండియన్ బ్యాంకు పేర్కొంది.

2011లోనే ప్రత్యూష సంస్థ డైరెక్టర్ పదవి నుండి తాను తప్పుకొన్నట్టుగా గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సంస్థ ఆర్ధికలావాదేవీలతో  తనకు సంబంధం లేదని మాజీ మంత్రి గంటా గతంలోనే స్పష్టం చేశారు. అయితే వేలం వేయనున్న ఆస్తుల జాబితాలో గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు కూడ ఉన్నాయి.

విశాఖలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ఉన్న వాణిజ్య భవనాన్ని బ్యాంకు వేలం వేయనుంది.గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఔట్ లో త్రివేణి టవర్స్ లో ఉన్న ఫ్లాట్, అదే చోట పి. రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోని మరో ఫ్లాట్ ను వేలం వేయనున్నారు.

ప్రత్యూష అసోసియేట్స్ షిప్పింగ్ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సాంబమూర్తినగర్ లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భూమిని, అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని వేలం వేయనున్నారు.

ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా సంస్థకు హైద్రాబాద్ మణికొండలోని ల్యాంకో హిల్స్ లో ఉన్న ఫ్లాట్ ను అటాచ్ చేయనున్నారు.ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమిని వేలం వేస్తారు.

ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ద్వారకనగర్ మొదటి లైన్ లోని శ్రీశాంతా కాంప్లెక్స్ లో ఉన్న ఆస్తిని వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6 వేల చదరపు గజాల భూమిని కూడ బ్యాంకు వేలం వేయనుంది.