చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మదనపల్లె బరోడా బ్యాంక్ మేనేజర్ చేబోలు రవిచైతన్య భార్య ఆమని (27) అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడింది. భర్త రవిచైత్యననే ఆమెను చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. 

సైనైడ్ సేవించడం వల్ల ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దాంతో నిందితుడు రవిచైతన్యను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. క్యాప్సూల్స్ లో సైనైడ్ కలిపి ఇవ్వడం వల్ల ఆమని మరణించినట్లు తెలిపారు. రవిచైతన్యనే ఆ పని చేశాడని ధ్రువీకరించారు. 

రవిచైతన్య (35)ను, అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంక్ మేనేజర్ రవి చైతన్య భార్య ఆమని గత నెల 27వ తేదీ ఉదయం ఇంట్లో స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన ఆమనిని రవి చైతన్య ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. 

బాత్రూంలో కిందపడిపోయి ఉందని, పొరుగింటివారు ఫోన్ చేయడంతో తాను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆమెను తీసుకుని వచ్చానని అతను వైద్యులకు చెప్పాడు.

వైద్యులు ప్రథమ చికిత్స చేసినా ఆమె కోలుకోలేదు. మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగా ఆమె మరణించింది. ఆమని మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా ఒంటిమిట్ట మండలం ఇందులూరు నుంచి ఆమె తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు మదనపల్లెకు వచ్చారు. కూతురు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు ేచశారు. 

అదనపు కట్నం కోసం తమ కూతురిని వేధించి చంపేశారని, బాత్రూంలో పడి మరణించినట్లుగా చెప్పారని వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అతనిపై, అతని తల్లిదండ్రులపై వరకట్నం కేసును నమోదు చేశారు. 

సైనైడ్ ఇవ్వడం వల్ల ఆమె మరణించినట్లు ఆ మర్నాడు వచ్చిన పోస్టుమార్టం నివేదికలో తేలింది. దాంతో రవిచైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అసలు విషయం చెప్పాడు.