మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని పెందుర్తి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చారు.

విశాఖపట్నం​: మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని పెందుర్తి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చారు. రాజకీయాల్లో కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని ఆయన అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్‌ అసత్యా ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు. "మీరు రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదు. మీ అన్న పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసు" అని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీని పవన్ కల్యాణ్ ఎందుకు విమర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు. పవన్‌ కేవలం బీజేపీ స్క్రిప్ట్‌నే చదివి వినిపిస్తున్నారని ఆయన అన్నారు. 

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో పవన్‌ ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా విశాఖలోనే ఉండి ఎందుకు రైల్వే జోన్‌ గురించి పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.