బందరు పోర్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది?: ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానమిదే
తక్కువ ఆదాయం వచ్చే పోర్టులకు సాగరమాల పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సోనోవాల్ వివరించారు. కానీ, మచిలీపట్నం ఓడరేవుకు సాగరమాల పథకం కింద ఇప్పటివరకు భారత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టు పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. పోర్టు పనులకు కావాల్సిన నిధులు ఏ పథకం ద్వారా అందజేస్తున్నారని పార్లమెంటులో ప్రశ్న వేశారు. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. అదేవిధంగా పోర్ట్ నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) అందజేస్తున్న ఆర్థిక సాయం వివరాలు తెలపాలని ఎంపీ బాలశౌరి కోరారు. బందరు ఓడరేవును ప్రధానమంత్రి గతి శక్తి కింద ఎందుకు తీసుకోలేదు? తీసుకోకపోవడానికి కారణాలు తెలపాలన్నారు.
ఈ అంశాలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మేజర్ పోర్ట్స్ (నాన్-మేజర్ పోర్ట్స్) కాకుండా ఇతర ఓడరేవులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణ కింద ఉన్నాయన్నారు. మచిలీపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాన్-మేజర్ పోర్ట్ కింద ఉందన్నారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యాయని... అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
తక్కువ ఆదాయం వచ్చే పోర్టులకు సాగరమాల పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సోనోవాల్ వివరించారు. కానీ, మచిలీపట్నం ఓడరేవుకు సాగరమాల పథకం కింద ఇప్పటివరకు భారత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, దీనికి బదులు ఓడరేవు అభివృద్ధి కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) టర్మ్ లోన్ రూ.3,940.42 కోట్లను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (APMB) అనుబంధ సంస్థ మచిలీపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MPDCL)కి మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ & IWAl ఆంధ్రప్రదేశ్ నిధుల నుంచి రూ.4,600 కోట్ల వ్యయంతో మొత్తం 36 ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. ఈ 36 ప్రాజెక్ట్‌లలో రూ.2,530 కోట్లు విలువైన 22 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.2,070 కోట్లు విలువైన 14 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. విశాఖపట్నం ఓడరేవులో అత్యాధునిక అంతర్జాతీయ క్రూయిజ్ కమ్ కోస్టల్ టెర్మినల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.