మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బెదిరింపులకు లొంగిపోయి సీఎం జగన్ మంత్రిపదవులిచ్చారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బాలినేని కౌంటరిచ్చారు.
ప్రకాశం: ఇటీవల జరిగిన ఏపీ మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy)ని తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. జగన్ నూతన మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని బాలినేని ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం బాలినేనికి మరోసారి అవకాశమివ్వకపోవడంతో భంగపడ్డ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు కూడా సిద్దపడ్డారని ప్రచారం జరిగింది. కానీ పలుమార్లు ప్రభుత్వ సలహాధారు సజ్జల రామకృష్ణారెడ్డి, చివరకు సీఎం జగన్ స్వయంగా బుజ్జగించడంతో మెత్తబడ్డ బాలినేని తిరిగి వైసిపి లైన్ లోకి వచ్చారు.
తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన బాలినేని మంత్రిపదవి దక్కనందుకు తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై పూర్తి విశ్వాసం వుందని... ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు. మంచి ఆలోచనాపరుడు కాబట్టే తాజాగా అన్ని వర్గాలకు సంతృప్తిపర్చేలా జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసారని బాలినేని పేర్కొన్నారు.
మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు కొందరు సీఎం జగన్ ను బెదిరించి మంత్రిపదవులు పొందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని... కానీ జగన్ అంత బలహీనమైన నాయకుడు కాదన్నారు. కేంద్రలో కాంగ్రెస్ అధికారంలో వుండగానే ఏకంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే ఎదిరించిన వ్యక్తం జగన్ అని గుర్తుచేసారు. బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తి జగన్ కాదనడానికి ఇదే నిదర్శనమని... ఆయన ఒకరికి లొంగేరకం కాదని మాజీ మంత్రి బాలినేని పేర్కొన్నారు.
ఇక నూతన మంత్రిమండలి ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న సమయంలో తనపై ప్రతిపక్షటిడిపి కావాలనే దుష్ర్పచారం చేసిందని బాలినేని అన్నారు. తాను 1700కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. తనపై చేసిన ప్రతి ఆరోపణపై చర్చకు తాను సిద్దమని... టిడిపి నాయకులు సిద్దమా? అని మాజీ మంత్రి సవాల్ విసిరారు.
ఇదిలావుంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏర్పడిన మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లానుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ కు చోటు దక్కింది. అయితే ఇటీవల మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించిన జగన్ సురేష్ కు తిరిగి మంత్రిగా అవకాశం కల్పించి బాలినేనిని మాత్రం పక్కనబెట్టారు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో పాటు సురేష్ కు తిరిగి మంత్రిపదవి దక్కడాన్ని బాలినేని తీవ్రంగా పరిగణించి ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దపడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మూడు నాలుగు దఫాలు బాలినేనితో సమావేశమై బుజ్జగించారు. చివరకు సీఎం జగన్ భేటీ తర్వాత ఆయన పూర్తిగా చల్లబడ్డారు.
సామాజిక సమతుల్యత పాటించాల్సిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పక్కన పెట్టాల్సి వచ్చిందని జగన్ తన దూతల ద్వారా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సమాచారం పంపారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గౌరవం తగ్గకుండా ఉండేలా చూసుకొంటామని కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు ప్రోటోకాల్ కు ఇబ్బంది లేకుండా నామినేట్ పదవిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది. ఇలా స్వయంగా సీఎం జగన్ భరోసా ఇవ్వడంతో బాలినేని శాంతించారు.
