టీడీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు.
హిందూపురం: టీడీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. రెండో విడత పసుపు, కుంకుమ కార్యక్రమం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాలకృష్ణ తన భార్య వసుంధరదేవితో కలిసి హిందూపురంలో పాల్గొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలోని సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నాడు ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆటో ర్యాలీ నిర్వహించారు. సూరప్ప కుంటలో ఎకోపార్కు నిర్మాణానికి భూమిపూజ చేశారు.చిన్నమార్కెట్‌లో అన్న క్యాంటిన్ ప్రారంభించారు. అంతకుముందు ఎంజీఎం క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడారు.
మహిళా సాధికారిత లక్ష్యంగా చంద్రబాబుానాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగినా.. ముందుచూపు అనుభవంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా అమలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.
మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగానే హిందూపురానికి తాగునీటిని తీసుకొస్తున్నారని చెప్పారు. త్వరలోనే నీటి సమస్య పరిష్కారం కానుందని ఆమె చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఒక్కరికే కాదు రాష్ట్రంలోని మహిళలకు సోదరుడే అని ఆమె చెప్పారు. మహిళలపై అభిమానంతో చంద్రబాబునాయుడు ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.
