Asianet News TeluguAsianet News Telugu

జూ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ: బాలకృష్ణ వ్యూహాత్మక స్పందన

అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై బాబాయ్ నందమూరి బాలకృష్ణ వ్యూహాత్మకంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకత ప్రదర్శించకుండానే చెప్పాల్సింది చెప్పారు.

Balakrishna strategical statement on Jr NTR political entry
Author
Hyderabad, First Published Jun 2, 2020, 5:13 PM IST

హైదరాబాద్: అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై బాబాయ్ నందమూరి బాలకృష్ణ వ్యూహాత్మకంగా స్పందించారు. ఏదైనా బాలకృష్ణ నిర్మొహమాటంగా మాట్లాడేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ మీద సానుకూల వైఖరి ప్రదర్శిస్తూనే తాను చెప్పాల్సిన విషయాన్ని బాలకృష్ణ చెప్పారు.

ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందించారు.  నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తు చాలా ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడం అనేది ఎన్టీఆర్ ఇష్టమని, వృత్తిని వదులుకుని రావాలని తాము చెప్పలేమని బాలయ్య అన్నారు. 

అలా అంటూనే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానంచబోమని నర్మగర్భంగా చెప్పారు. నిజానికి, గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగానే వాడుకున్నారు. అయితే, టీడీపీలో వారసత్వ సమస్య రావడంతో క్రమంగా ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

తన కుమారుడు నారా లోకేష్ ను తన వారసుడిగా నిలబెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం చేశారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, బాలకృష్ణ సోదరుడు అప్పట్లో తీవ్రంగా స్పందించారు. అయితే, క్రమంగా హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెడుతూ వచ్చారనే అభిప్రాయం ఉంది. బాలకృష్ణకు ప్రాధాన్యం ఇస్తూ వారి ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ వచ్చారని చెబుతారు. 

ఈ క్రమంలోనే బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు కూడా పెరిగాయి. అ విభేదాల గురించి, అప్పట్లో జరిగిన వ్యవహారాల గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత రెండు మూడు సార్లు టీడీపీ కోసం తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమతాన్ని పరోక్షంగా వ్యక్తపరిచారు. అయినా కూడా ఆయనకు పార్టీలో స్థానం కల్పించలేదు. 

వ్యూహాత్మకంగానే మరో వ్యాఖ్య కూడా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై చేశారు. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాల్లో, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నామని అన్నారు. మరొకరికి అది సాధ్యం కాదని ఆయన చెప్పకనే చెప్పారు. అంటే, జూనియర్ ఎన్టీఆర్ అలా సమన్వయం చేసుకోలేరని ఆయన నర్మగర్భంగా చెప్పారని అంటున్నారు. చివరగా, రాజకీయాల్లోకి రావడమనేది వాళ్ల ఇష్టమని బాలకృష్ణ అన్నారు.  

ఇదిలావుంటే, జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో రాజకీయాల గురించి అసలు మాట్లాడడం లేదు. రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన చాలా కాలంగా ఏమీ మాట్లాడడం లేదు. సినిమాలకే ఆయన పూర్తిగా తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios