టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను అధికారులు తొలగించారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా (guntur district) మంగళగిరిలో (mangalagiri) గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) జన్మదినాన్ని పురస్కరించుకుని బాలయ్య అభిమానులు, టీడీపీ (tdp) శ్రేణులు మంగళగిరి బస్టాండ్ సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని భావించాయి. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చాలా రోజులుగా టీడీపీ శ్రేణులు చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడే తాజాగా అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు వారు యత్నించారు.
దీనిపై సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు అన్న క్యాంటీన్ ఏర్పాట్లను అడ్డుకున్నారు. తాము సేవా కార్యక్రమం మాత్రమే చేస్తున్నామని టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. బాలయ్య అభిమానులు, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు రోడ్డుపై బైఠాయించారు.
