అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఉన్న సంబంధాలపై బిజెపి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కేసీఆర్ మార్గదర్శి అని ఆయన అన్నారు. పేరుకే జగన్ సీఎం అని, నిర్మాణం, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ కేసీఆరేనని ఆయన అన్నారు. 

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడిన కేసీఆర్ జగన్ కు ఇప్పుడు గురువుగా మారారని ఆయన అన్నారు. కోతికి అద్దమిస్తే ఏం చేయాలో తెలియక నేలకేసి కొట్టినట్లుగా జగన్ పరిపాలన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చారని, దాన్ని జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నారని ఆయన అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని బైరెడ్డి విమర్శించారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో జరిగిన బిజెపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్కీకార కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.