కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాను పోటీ చేస్తానని మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను అందుకు సిద్ధమని అన్నారు. 

శుక్రవారం మహానంది మండల పరిధిలోని గాజులపల్లె, ఎం తిమ్మాపురం గ్రామాల రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మహానంది ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 

త్వరలో శ్రీశైలం నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర ప్రారంభిస్తామని బైరెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు పెట్టుబడికి రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ విధానాలు నచ్చే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపైనే పెడతారని చెప్పారు.