విజయవాడ: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై చురకలు వేశారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. చంద్రబాబు నాయుడును విమర్శించడానికి జగన్ కు మౌనం అడ్డురాదన్నారు. కానీ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడంలో మాత్రం జగన్ మౌన వ్రతం పాటిస్తారని ఎద్దేవా చేశారు. 

విజయవాడలో సీపీఎం నిర్వహించిన రాష్ట్ర వర్క్ షాపులో పాల్గొన్న రాఘవులు జగన్ మోదీని విమర్శించకపోవడానికి కారణాలు అనేకమన్నారు. చంద్రబాబును నిత్యం విమర్శించే జగన్‌, మోదీ విధానాలను విమర్శించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు, ఆర్థిక విధానాలతో దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థమైందని రాఘవులు మండిపడ్డారు. నోట్ల రద్దును సమర్థించిన చంద్రబాబు రూ.2వేల నోటు ముద్రణను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

తొలి నుంచి బీజేపీ విధి విధానాలను, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తున్న పార్టీలు కేవలం వామపక్ష పార్టీలు మాత్రమేనన్నారు. మిగిలిన పార్టీలు అంతగా స్పందించడం లేదన్నారు.