అనంత జేఎన్‌టీయూలో బీటెక్ సెకండియర్ స్టూడెంట్ మృతి: పోలీసుల దర్యాప్తు
అనంతపురంలోని జేఎన్ టీయూ హస్టల్ లో ఓ విద్యార్ధి ఇవాళ మృతి చెందారు. చాణక్య అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడా, ప్రమాదవశాత్తు భవనం పై నుండి కింద పడ్డాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం: నగరంలోని జేఎన్‌టీయూ లో విద్యార్థి చాణక్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. జేఎన్ టీయూ హస్టల్ లో ఉంటున్న బీటెక్ సెకండియర్ విద్యార్ధి చాణక్య గురువారం నాడు చనిపోయాడు. హస్టల్ భవనం నుండి చాణక్య కిందపడి మృతి చెందాడు. చాణక్య ప్రమాదవశాత్తు హస్టల్ భవనం నుండి కిందపడ్డాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా చాణక్య సహచర విద్యార్ధులలో మంచిగానే ఉన్నాడని కూడా కాలేజీ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. నిన్న రాత్రి కూడా హస్టల్ గదిలో ఉన్న సహచరులతో మంచిగా ఉన్నాడని ప్రిన్సిపాల్ మీడియాకు చెప్పారు. ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు తన బెస్ట్ ఫ్రెండ్ కు బై అంటూ చాణక్య మేసేజ్ పంపినట్టుగా చెబుతున్నారు. చాణక్య ఉపయోగించిన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ ఫోన్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. చదువులో కూడా చాణక్య ముందుంటాడని ప్రిన్సిపాల్ తెలిపారు. చాణక్యది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిగా గుర్తించారు. చాణక్య కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం పంపారు. చాణక్య మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.