విశాఖపట్నం: కరోనా విషయంలో వైసిపి ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో వుందో పాజిటివ్ గా తేలిన వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేల వ్యవహారాన్ని బట్టే అర్థమవుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు అందిస్తున్న వైద్యం అంతగొప్పగా వుంటే విజయసాయి రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఇతరరాష్ట్రాల్లో ఎందుకు చికిత్స పొందుతారంటూ సీఎం జగన్, వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. 

''ప్రజలకి చెట్టు కింద వైద్యం. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్లకు హైదరాబాద్ లో కార్పొరేట్ వైద్యమా? వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్ లో వైద్యం ఎందుకు చేయించుకోవడం లేదు?'' అని అయ్యన్న ప్రశ్నించారు. 

''టెస్టుల్లో టాప్, వైద్యం లో నెంబర్ 1 అంటూ డప్పుకొట్టుకుంటున్న వారు కరోనా పాజిటివ్ రాగానే ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోవడానికి ఎందుకు పారిపోతున్నారు? ఈ వివక్ష ఎందుకు జగన్ రెడ్డి గారు?'' అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. 

''ఆంబులెన్స్ రాక రోగులను ఆటోల్లో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి,సరైన వైద్యం అందక ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు వదులుతున్న దుస్థితి. కనీస గౌరవం లేకుండా మృతదేహాలను జెసిబిలతో విసిరేస్తారా? ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి మంచిది కాదు'' అని వైసిపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను హెచ్చరించారు అయ్యన్నపాత్రుడు.