ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. అర్థరాత్రి వేళ జీవోలను విడుదల చేస్తూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని, రాజ్యాంగానికి జగన్ మోహన్ రెడ్డి అతీతుడిగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శలను గుప్పించారు. 

"వైకాపా ప్రభుత్వానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం అంటే గౌరవం లేదు.చట్టం అంటే విలువ లేదు.హై కోర్టు తీర్పుని తూర్పార పడుతూ అర్ధరాత్రి జిఓ లు ఇవ్వడం ద్వారా రాజ్యాంగానికి,చట్టానికి అతీతుడిని అని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు.

ప్రజలు కూడా మాకు ''రాజారెడ్డి''  రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్క సారి ఆలోచించుకొండి.ఇప్పటికైనా రాజ్యాంగం,చట్టాల పట్ల గౌరవంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. " అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. 

ఇక నిన్న కూడా జగన్ పై అయ్యన్నపాత్రుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తీవ్రంగా ఫైర్ అయ్యారు. హై కోర్టు ఇచ్చిన తీర్పు నియంత జగన్ కు చెంపపెట్టు వంటిదని అభిప్రాయపడ్డాడు. 

న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని,  తాజాగా హై కోర్టు రమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పుతో నియంత అయిన జగన్ చెంపచెల్లుమందని అన్నారు అయ్యన. 

ఇకనైనా జగన్ బుద్ధి తెచ్చుకుని కళ్లుతెరిచి మంచి పరిపాలన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం జారీ చేసిన దస్త్రంపై గవర్నర్ కళ్లుమూసుకుని సంతకం చేశారని, రానున్న రోజుల్లో అయినా గవర్నర్ దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు పునరాలోచన చేయాలని అన్నారు అయ్యన. 

రాష్ట్రాన్ని పాలించటం జైళ్లో ఉన్నంత తేలిక కాదన్న విషయం జగన్ గ్రహించాలని, కక్షసాధింపులు ఇకనైనా మాని దౌర్జన్యాలు వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తే అందరికీ మంచిదన్నారు అయ్యన. 

ఇప్పటికైనా ఆప్తులైన సుబ్బారెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డిల ఆగడాలు మితిమీరాయని జగన్ గ్రహించాలని, వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసి కూడా మాట్లాడటంలేదంటే జగన్ ప్రోత్సాహం వీరి వెనుక ఉందని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.