విశాఖపట్నం: వాయుగుండం ప్రభావంతో విశాఖ పోర్టు నుంచి తీరానికి కొట్టుకువచ్చిన కార్గో షిష్ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? లేక... తీరంలోనే రెస్టారెంట్ గా మారనుందా? బంగ్లాదేశ్ కి చెందిన 'ఎంవీ మా' నౌక పోర్ట్ యాంకరేజ్ నుంచి తెన్నేటి పార్కుకి కొట్టుకొచ్చి ఇరవై రోజులు దాటినా ఇంకా దీని భవితవ్యం తేలడం లేదు.'ఎంవీ మా' నౌకను తిరిగి సముద్రంలోకి పంపించాలంటే ముందుగా అందులోని క్రూడ్, డీజిల్ ను బయటకు తీయాలి. తర్వాత నౌకను సముద్రంలోకి పంపించాలి. 

దీనికోసం ఆ నౌకా యాజమాన్యం నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ ఇప్పటికే నౌక లోని డీజిల్, క్రూడాయిల్ ను బయటకు తీసేసి, నౌకను సముద్రంలోకి పంపేందుకు సిద్ధమౌతోంది.ఈ నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన ఒక ప్రకటన గందరగోళానికి దారి తీసింది. 

"బంగ్లాదేశ్ నౌకని రెస్టారెంట్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే విశాఖలో టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం, సబ్ మెరైన్... లాంటివి పర్యాటక రంగానికి అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. తీరానికి కొట్టుకొచ్చిన ఈ బంగ్లాదేశ్ నౌకను కూడా పర్యాటక కేంద్రంగా వినియోగించుకోవాలని భావిస్తున్నాం. దీనికోసం ఓడ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం." అని మీడియాతో చెప్పారు.

గతంలో ఐఎన్ఎస్ విరాట్‌ యుద్ధ నౌకను విశాఖలో పర్యాటక ప్రాజెక్టుగా మార్చాలని ప్రయత్నించారు. రక్షణ శాఖకు సుమారు ముప్ఫై ఏళ్లు సేవలందించిన ఈ నౌక మూడేళ్ల క్రితం విరామం తీసుకుంది. ముంబయి నావల్‌ డాక్‌ యార్డ్‌లో ఉన్న ఈ నౌకను విశాఖకు తీసుకు రావాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే విరాట్‌ నౌకను ఏపీకి తీసుకువచ్చి... దాన్ని మ్యూజియంగా మార్చాలంటే సుమారు 1000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని పర్యాటక శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత ఖర్చు భరించలేమని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

విరాట్ విషయం అలా ఉంటే...ఎంవీ మా నౌక మొత్తం ఖరీదు సుమారుగా రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. దాన్ని తీరం నుంచి తరలించేందుకు ఐదు కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నట్టు నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘‘సముద్రంలోకి తరలించలేని పక్షంలో మాత్రమే ఆ నౌకను ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాం.కానీ...నౌకను వంద శాతం తీరం నుంచి సముద్రంలోకి తీసుకువెళతాం’’ అని వారు చెప్తున్నారు.గతంలో విరాట్‌ యుద్ధనౌకను పర్యాటక కేంద్రంగా మార్చాలనుకోవడానికి కారణం... ఆ నౌకలో సిబ్బంది, ఇతర అవసరాల కోసం నిర్మించిన సుమారు వేయి గదులు ఉండటమే. దీనిలో హెలీకాప్టర్‌ ల్యాండింగ్ కోసం భారీ డెక్‌లు కూడా ఉన్నాయి. 

కానీ...ఎంవీ మా కేవలం 15 మంది సిబ్బంది ఉండే ఒక కార్గో నౌక. సరకు రవాణా కోసం ఉపయోగపడే నౌక ఇది. దీన్ని రెస్టారెంట్ గా మార్చాలంటే డెక్ నిర్మించాలి. అది కూడా చాలా చిన్నది మాత్రమే సాధ్యమవుతుంది. దీంతో రెస్టారెంట్ గా మారిస్తే ఆకర్షణే తప్ప... వాణిజ్యపరంగా ఉపయోగం ఉంటుందా..? సుమారు మూడు వేల టన్నుల బరువున్న ఈ నౌకను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, పర్యటక ఆకర్షణగా మార్చాలన్నది రాష్ట్రప్రభుత్వం ఆలోచన అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ బీబీసీకి చెప్పారు. 

‘‘నౌక లోపలి భాగాలను సందర్శకులకోసం, నౌక పైభాగాన్ని ఆతిథ్య సేవలకూ ఉపయోగించేలా తయారు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు సీఎంగారికి చెప్పాం. ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా... షిష్ యాజమాన్యంతోపాటు పోర్టు, మెరైన్, నేవీ అధికారులతో చర్చించి అమలులోకి తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రొసెస్ కూడా మొదలు పెట్టాం." అని చెప్పారు.

ఒకవైపు నౌక యాజమాన్యం దాన్ని సముద్రంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో పర్యాటకశాఖ మంత్రి రెస్టారెంట్ గా మారుస్తామంటూ ప్రకటించారు. బంగ్లాదేశ్ యాజమాన్యం తరపున'ఎంవీ మా' నౌక పనులను పర్యవేక్షిస్తున్న 'నవ్ షిప్ మెరైన్ ప్రయివేటు లిమిటెడ్' సంస్థ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటనపై స్పందించింది.

"నౌకని సముద్రంలోకి పంపే పనిని ప్రారంభించి రెండు వారాలు అవుతోంది. ఇది ఈ నెల 15 నాటికి పూర్తవుతుంది. ఇప్పటికే దాదాపు 30 శాతం పనులు పూర్తయ్యాయి. యూఎస్ఏకి చెందిన రిసాల్వ్ మెరైన్ అనే సంస్థ షిప్ సాల్వేజ్ (నౌకని సముద్రంలోకి పంపే ప్రక్రియ) పనులు చేస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర అధికారులూ సహకారం అందించాలని లేఖలు రాసింది. అన్నీ సహకరిస్తే నవంబర్ 15వ తేదీ నాటికి ఎంవీ మా నౌక సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే కొందరు సాల్వేజ్ టీం సభ్యులు విశాఖ చేరుకున్నారు. సింగపూర్ నుంచి కూడా నిపుణులు వస్తున్నారు. ఇలాంటి తరుణంలో నౌకని రెస్టారెంట్ గా మార్చనున్నామని ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది." అని నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్ సీఎండీ ఎం. భూపేష్ ఒకవైపు చెబుతున్నారు. 

మరో వైపు నౌకను రెస్టారెంట్ గా మారుస్తున్నామని మంత్రి ప్రకటన, మరోవైపు బంగ్లాదేశ్ షిప్ యాజమాన్యం తరపున సంబంధిత ప్రతినిధి ఖండనతో ఎంవీ మా నౌక తీరం నుంచి సముంద్రంలోకి వెళ్తుందా... తీరంలోనే రెస్టారెంట్ గా స్థిరపడనుందా అనేది తేలాలి. నౌక సముద్రంలోకి వెళ్తుందా? పర్యాటక కేంద్రంగా మారనుందా?... అనే అంశంమీద మాట్లాడేందుకు జిల్లా అధికారులు ఎవరూ సముఖత వ్యక్తం చేయలేదు.