నెల్లూరు: తెల్లవారుజామున నగరాన్ని శుభ్రం చేసేందుకు వెళుతున్న ఓ పారిశుద్ద్య కార్మికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఒంటరిగా కనిపించిన మహిళను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇందుకు ఆమె తీవ్రంగా ప్రతిగటించడంతో గాయపర్చి పరారయ్యాడు. ఈ దారుణం నెల్లూరులో చోటుచేసుకుంది. 

నెల్లూరు పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున ఓ మున్సిపల్ కార్మికురాలు విధుల నిమిత్తం బయలుదేరింది. ఇలా ఒంటరిగా వెళుతున్న ఆమెపై ఓ ఆటోడ్రైవర్ కన్నేశాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకుని  మినీ బైపాస్ రోడ్డు మీదుగా తీసుకెళ్లి పొదల్లోకి తీసుకెళ్లి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు.

 

అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని పెద్దగా కేకలు వేయడంతో భయపడిపోయిన ఆటో డ్రైవర్ ఆమెపై దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాయాలతో పడివున్న ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం బాగానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్నమున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.