విజయవాడలో ఉద్రిక్తత... టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిపై రాళ్ల దాడి (వీడియో)
పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసిపి- ప్రతిపక్ష టిడిపిల మధ్య సాగుతున్న మాటల యుద్దం కాస్త వ్యక్తిగత దాడులకు దారితీసింది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతలు కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార వైసిపి- ప్రతిపక్ష టిడిపిల మధ్య సాగుతున్న మాటల యుద్దం కాస్త వ్యక్తిగత దాడులకు దారితీసింది. ఈ క్రమంలోనే విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభి గాయపడ్డారు.
ఇంటి నుండి పార్టీ కార్యాలయానికి బయలుదేరగా మార్గ మధ్యలో తనపై దాడి జరిగినట్లు పట్టాభి వెల్లడించారు. పెద్ద బండరాళ్ల, రాడ్ లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలి అందులో వున్న తమకు గాయాలైనట్లు తెలిపారు. ఈ దాడిలో కారు ద్వంసమవడంతో పాటు తన సెల్ ఫోన్ కూడా పగిలిపోయినట్లు పట్టాభి తెలిపారు. ఈ దాడి వైసిపి పనేనని ఆయన ఆరోపించారు.
వీడియో
పట్టాభిపై దాడి జరిగినట్లు తెలిసినవెంటనే టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాభిరాంను పరామర్శించిన ఉమ వైసిపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పట్టాభికి న్యాయం జరగకపోతే విజయవాడ అగ్నిగుండంగా మారుతుందని బోండా హెచ్చరించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ దాడిపై స్పందించారు. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆధారాలతో జగన్ రెడ్డి అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని లక్ష్యంగా చేసుకుని ఆ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతాం అని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. జాతీయ అధికారప్రతినిధి పట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి మరీ గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోందని... అయితే వారి బెదిరింపులకు అదరమన్నారు. ఈ దాడులకు బెదరకుండా అరాచకపాలనని అంతమొందించి తీరుతామని లోకేష్ హెచ్చరించారు.