ఏలూరు: ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవలే అమరావతి మంగళగిరి అంగడి జ్యోతి హత్య మరువకముందే అదే గుంటూరులో మరో జ్యోతి దారుణ హత్యకు గురయ్యింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో యువతి హత్యకు గురైంది. 

కామవరపు కోట మండలం జీలకర్రగూడెంకు చెందిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కొండపై గల గంటుపల్లి బౌద్ధారామం సందర్శనకు ఆ జంట వచ్చిన ఆదాడిపై గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా దాడి చేశారు. 

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే యువకుడు రక్తపు మడుగులో కొనఊపిరితో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం నిమిత్తం యువకుడుని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

యువకుడు భీమడోలుకు చెందిన నవీన్ గా గుర్తించారు పోలీసులు. యువకుడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

యువతిని వివస్త్రను చెయ్యడం, తీవ్రంగా గాయాలు పాలై చనిపోవడం చూస్తుంటే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు గాయాలతో బయటపడ్డ యువకుడు నవీన్ ను పోలీసులు విచారిస్తున్నారు. 

అటు యువకుడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో నవీన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మంగళగిరిలో జ్యోతిని ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించాలని ఎలా తప్పుదోవ పట్టించాడో నవీన్ కూడా అలానే ప్రయత్నిస్తున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కొండపైకి యువతీ, నవీన్ లకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లు స్థానిక వాచ్ మెన్ చెప్పడం గమనార్హం. ఇద్దరికి మాత్రమే టికెట్లు ఇస్తే దాడి చేసింది ఎవరా అని ఆరా తీస్తున్నారు. ప్రేమ జంటపై దాడి ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోవడం యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవ్వడంతో జీలకర్రగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.