కరోనా వైరస్ అన్ని రంగాలను ఇబ్బంది పెట్టినప్పటికీ మనషిలో మాయమైపోతున్న మానవత్వాన్ని తట్టిలేపింది. తోటి వారి కష్టాన్ని చూసి చలించే మనుషులు ఇంకా సమాజంలో ఉన్నారనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లింది.

అలా లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల కడుపు నింపుతున్న కుటుంబాన్ని అభినందించాల్సింది పోయి వారిపై దాడికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో కరణం వెంకటేశ్ యూత్ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా చేనేతపురి కాలనీలో పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.

ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబం పర్యవేక్షిస్తోంది. ఇది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులైన అనుములు శ్రీను అలియాస్ శివ, అతని తమ్ముడు పృథ్వి, మరో నలుగురు కలిసి ఆదివారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు.

ఈ ఏరియా తమదని, ఇక్కడ ఏమైనా చేయాలంటే తమ నాయకుడు చేయాలని, ఇతరులెవరూ చేయడానికి వీల్లేదని వారు హెచ్చరించారు. దీనిపై స్పందించిన వెంకటేశ్వర్లు.. పేదలకు మంచి చేయడానికి ఎవరి అనుమతి కావాలని నిలదీయడంతో ఆమంచి అనుచరులు రెచ్చిపోయారు.

వెంకటేశ్వర్లుతో పాటు ఆయన కొడుకు ప్రశాంత్‌ను చితకబాదారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకటేశ్వర్లు భార్య ఉమా మహేశ్వరిని మహిళ అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారు.

తలను గోడకేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.