వైసీపీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై అన్యాయంగా అట్రాసిటీ కేసు బనాయిస్తున్నారు... అయితే ఇలా ఎస్సీలపై కూడా అట్రాసిటీ కేసులు పెడుతున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. దళితుల వల్లే తాము అధికారంలోకి వచ్చామని బహిరంగంగా చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే అధికారమదంతో వారిని నేలకేసి కొడుతున్నారని అన్నారు. . దళితుల రక్షణ కోసం రూపొందించిన అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అనిత ఆరోపించారు.
''వైసీపీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై అన్యాయంగా అట్రాసిటీ కేసు బనాయిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారింది. భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు'' అన్నారు.
''టీడీపీ కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామి రైతు భరోసా కార్యక్రమానికి హాజరయిన సమయంలో ఆయన్ను అవమానించారు. దీనిపై నాడు ఎస్పీగా ఉన్న సిద్దార్థ కౌశిల్ కి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే సిద్దార్థ కౌశిల్ కు నేడు దేవినేని ఉమాపై పెట్టిన కేసు ఎందుకు స్ట్రాంగ్ గా కనిపించింది?'' అని ప్రశ్నించారు.
read more సీఎం జగన్ దిగిరాక తప్పలేదు... ఈ విజయం వారిదే: అచ్చెన్నాయుడు
''మాజీ మంత్రి ఉమ అక్రమ మైనింగ్ పై ప్రశ్నిస్తే వైసీపీ గూండాలు దాడి చేశారు. కానీ రివర్స్ లో ఆయనపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణం. వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ అట్రాసిటీ కేసును పావుగా వాడుతోంది. గతంలో కూడా పులివెందులలో మహిళకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన మాపై అట్రాసిటీ కేసు పెట్టారు. దళితుల మీద అట్రాసిటీ కేసు పెట్టడమేంటి? పోలీసులకు బుర్ర పనిచేస్తోందా?'' అని మండిపడ్డారు.
''దళిత అసైన్డ్ భూములను లాక్కోవడాన్ని ప్రశ్నించిన మహాసేన రాజేష్ ను అవమానించి జైల్లో పెట్టారు. అతని కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ని అన్యాయంగా జైలు పాలు చేశారు. మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చివానిగా ముద్రవేసి ఆయన చావుకు కారణమయ్యారు. చీరాలలో దళిత యువకుడు మాస్కు పెట్టుకోలేదని అన్యాయంగా పోలీసులు అతన్ని పొట్టనపెట్టుకున్నారు'' అని ఆరోపించారు.
''దళితుల ఓట్లతో గెలిచి వారినే చంపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళిత ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దళితులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా, దళితులకు భద్రత కల్పించకపోయినా తిరుగుబాటు తప్పదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అన్నారు వంగలపూడి అనిత.
