కులం పేరుతో దూషించారని వైసీపీ కి చెందిన సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా ఇది చోటు చేసుకుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో పెరిగిన కరెంట్ ఛార్జీలను నిరసిస్తూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పరిధిలోని వెంకంపాలెంలో కూడా సోమవారం నిరసన తెలియజేశారు. అయితే ఈ క్రమంలో అక్కడ గొడవ చోటు చేసుకుంది.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం చేపడుతుండగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని తనను కులం పేరుతో తిట్టాడని స్థానిక సర్పంచ్ టి. భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో వైసీపీకి చెందిన సర్పంచ్ టి.భూపతి, ఉప సర్పంచ్ ఎస్.రమేష్ రెడ్డి తో పాటు మరి కొందరు నాయకులు ఆయుధాలతో టీడీపీ నాయకులను తిడుతూ కొట్టబోయారని ఆరోపించారు. దీంతో తమను తాము కాపాడుకున్నామని వారు చెప్పారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదును ఎస్ఐ స్వీకరించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్టు ఎస్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలియజేశారు.
