ప్రకాశం జిల్లాలో ఓ వివాహితను దుండుగులు దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు తిరిగిస్తామని చెప్పడంతో ఆమె ఒంటరిగా ఇంట్లో నుంచి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెను హతమార్చారు.
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అప్పు తీరుస్తామని పిలిచి ఓ వివాహితను దుండుగులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై కిరాతకంగా కారు ఎక్కించి, బండ రాళ్లతో మోదారు. పాశవికంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలోని జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన మేడం సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మమ్మ కూతురు రాధ(35). ఆమెను తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోహన్ రెడ్డికి ఇచ్చి కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య ఇంట్లోనే ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి ఒకరికి రూ.50 లక్షలను అప్పుగా ఇచ్చారు. అయితే ఈ నెల 11న రాధ.. చౌడేశ్వరిదేవీ పూజల నిమిత్తం తన తల్లిగారి ఊరికి వచ్చారు. ఈ క్రమంలో ఒకరు ఆమెకు ఫోన్ చేశారు. తాను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. కనిగిరికి వస్తే మీ దగ్గర తీసుకున్న అప్పును మా వాళ్లు తీర్చేస్తారని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన రాధ.. తన చిన్న కొడుకుని తీసుకొని కనిగిరిలో నివసించే బాబాయి నాగిరెడ్డి ఇంటికి బుధవారం సాయంత్రం వెళ్లారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది. అక్కడి వెళ్లిన తరువాత ఆ వ్యక్తి నుంచి రాధకు మళ్లీ కాల్ వచ్చింది.
పామూరు బస్టాండ్ దగ్గరకు వచ్చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. దీంతో తన కొడుకు ఇంటి దగ్గరే ఉంచి, ఆమె ఒంటరిగా అతడు సూచించిన ప్రాంతానికి వెళ్లారు. రాత్రి అయినా రాధ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన ఆమె.. వచ్చేస్తున్నాను అంటూ వారికి చెప్పింది. మళ్లీ కొంత సమయం తరువాత ఆమెకు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
తమిళనాడులో విషాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు
రాత్రి 8 గంటల దాటినా కూతురు ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోకపోవంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి తండ్రి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఆమె సెల్ ఫోన్ లొకేషన్ ను కనిబెట్టి, రాధ జిల్లెళ్లపాడు సమీపంలోనే ఉందని చెప్పేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి చూశారు. అక్కడ రాధ చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు.
తరువాత అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే.. ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్టు కనిపిస్తోంది. కాళ్లపై నుంచి కారును పోనిచ్చి, తరువాత గుండెలపై నుంచి కూడా నడిపినట్టు అర్థమవుతోంది. మళ్లీ ఆమె ఎక్కడ బతుకుతుందో అనే భయంతో బాధితురాలి ముఖంపై బండరాళ్లతో మోదినట్టు తెలుస్తోంది. కాగా.. తన అల్లుడు, కూతురు కలిసి వెలిగండ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి రూ.50 లక్షలు అప్పు ఇచ్చారని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అతడే ఈ హత్య చేయించి ఉంటారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
