Asianet News TeluguAsianet News Telugu

వెంకాయమ్మపై దాడి, సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం వైసిపి పనే... చర్యలు తీసుకోండి: ఎస్పీకి అచ్చెన్న లేఖ

వైసిపి నాయకులను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మపై రక్షణ కల్పించాలని... ఆమెపై దాడిచేసి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి అచ్చెన్నాయుడు లేఖ రాసారు.  

atchannaidu writes letter to guntur sp  over attack on venkayamma
Author
Guntur, First Published May 18, 2022, 10:08 AM IST

గుంటూరు: ఎన్నికలకు రెండేళ్ళ ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) తో  పాటు వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలా 'గడపగడపకు మన ప్రభుత్వం' (gadapagadapaku mana prabhutvam) పేరిట మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ప్రజాప్రతినిధులంతా సొంత నియోజకవర్గాల బాట పట్టారు.అయితే ప్రజల్లోకి వెళుతున్న కొందరు నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ సమస్యలనే కాదు స్థానిక సమస్యలను తెలుపుతూ వైసిపి ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మ కూడా తన సమస్యపై వైసిపి నేతలను నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదల ఆకలిబాధను తీర్చడానికి అన్న క్యాంటిన్లు ఏర్పాటుచేస్తే వైసిపి ప్రభుత్వం వాటిని తీసేయడం, చంద్రన్న భీమా తొలగించడంపై వైసిపి నాయకులను వెంకాయమ్మ ప్రశ్నించింది. అలాగే ఇంటివద్దకే సన్నబియ్యం, కౌలు రైతులకు రుణాల హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించింది. అయితే ఇలా ప్రశ్నించినందుకు తన ఇంటిపై రాత్రి సమయంలో వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తోంది. దీంతో ప్రతిపక్ష టిడిపి ఆమెకు మద్దతుగా నిలిచింది. 

వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాసారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారని... రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అచ్చెన్న పేర్కొన్నారు. 

''వెంకాయమ్మ నిరుపేద మహిళ. ఆమెకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మే 16న తన భూమి సమస్యపై ఫిర్యాదు చేసేందుకు గుంటూరు వెళ్లారు. కానీ స్పందనలో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పందన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తన అసమ్మతిని తెలియజేసింది. వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపినందుకు స్థానిక వైసీపీ మద్దతుదారులు ఆమెపై భౌతిక దాడి చేసి ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లు, పాత్రలు ధ్వంసం చేశారు. ఆమె కుమారుడిపై దాడి చేసి అతడి సెల్ ఫోన్‌ను ధ్వంసం చేశారు'' అని వెంకాయమ్మ జరిగిన దాడిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. 

''వెంకాయమ్మపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో  ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఆమెపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోండి'' అని అచ్చెన్న ఎస్పీని కోరారు. 

''అధికార వైసీపీ నాయకుల దాడులతో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల భాగస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికార వైసిపి అనుచరుల నుంచి వెంక‌య‌మ్మ‌ను కాపాడాల‌ని ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. దోషులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. మీరు తీసుకునే సత్వర చర్యలు ప్రజాస్వామ్య విలువలను, ప్రాథమిక హక్కులను రక్షించడంలో దోహదపడుతాయి'' అని అచ్చెన్నాయుడు ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా వెంకాయమ్మపై జరిగిన దాడిపై స్పందించారు. జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదు కోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని మండిపడ్డారు. వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ ప‌రిణామాలు త‌ప్ప‌వని లోకేష్ హెచ్చరించారు. 

 మీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లని... తమ ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులని లోకేష్ చెప్పారు. నిర‌క్ష‌రాస్య‌, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్ర‌తీ ఇంటా, ప్ర‌తీ నోటా వినిపిస్తోందని... ఈ ఐదు కోట్ల‌ మంది పైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌రెడ్డి గారు? అని లోకేశ్ ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios