అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు ఆస్తికి నష్టం జరగకుండా చూశామని... జగన్ ప్రభుత్వంలో దేవుళ్లతో సహా ఎవరికీ రక్షణ లేదన్నారు. టీడీపీ కార్యకర్తలేం చేశారని వారిని ఇంత దారుణంగా హతమారుస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

''సీఎం జగన్ నరరూప రాక్షసుడిగా మారారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నరికి చంపుతున్నా డీజీపీకి చలనం లేదు. కడపలో ఎమ్మెల్యే బావమరిది టీడీపీ నేత హత్యలో స్వయంగా పాల్గొన్నారు'' అని ఆరోపించారు.

''అంకుల్ హత్యకు కారణమైన వారిని అరెస్టులు చేయాలి. డీజీపీ కళ్లు తెరిచి ముద్దాయిలను పట్టుకోవాలి. పోలీసులకు పిచ్చి పట్టింది. విజయసాయి మీద రాళ్లేసిన ఘటనలో మాకేం సంబంధం లేదు. ప్రజలే ఆగ్రహానికి గురై విజయసాయిపై రాళ్లేశారు. రాముడి తల నరికిన వ్యక్తులే పరిశీలనకు వస్తే ప్రజలు ఆగ్రహం చెందారు'' అన్నారు.

read more  జగన్మోహన్ రెడ్డి అండతోనే టిడిపి నేతల హత్యలు: చంద్రబాబు ఆగ్రహం

''కేసులు పెట్టే ముందు పోలీసులు వీడియోలు చూడరా..?మేము అధికారంలోకి రాగానే.. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు.అందరి చిట్టా రాస్తున్నాం..కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదిలి పెట్టం''అని హెచ్చరించారు.

''ఓ దొంగ కంప్లైంట్ ఇస్తే మాపై కేసులు పెడతారా..? డీజీపీకి బుద్దుందా..? రామతీర్ధం వెళ్లడానికి చంద్రబాబుకు పర్మిషన్ ఇచ్చి.. విజయసాయికి సహకరించారు. విజయసాయిపై కేసు పెట్టాల్సింది పోయి.. మాపై కేసులు పెడతారా..?'' అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.