Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై... త్వరలోనే డీజీపీ సమాధానం...: వర్ల సంచలనం

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినా ఉపసంహరించుకు నేలా అభ్యర్థులను బెదిరించడం, ప్రచారానికి రాకుండా భయపెట్టడం వంటి చర్యలు జగన్ నేత్రుత్వంలో జరుగుతున్నాయని టిడిపి సీనియర్ వర్ల రామయ్య ఆరోపించారు. 

atchannaidu arrest... varla ramaiah serious on AP DGP
Author
Vijayawada, First Published Feb 2, 2021, 1:24 PM IST

విజయవాడ: స్థానిక ఎన్నికల్లో ఏంచేసైనా మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని, అక్రమమార్గంలో వెళుతోందని, అరాచకాలకు పూనుకుంటోందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి,  పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బండారం ప్రజలకు తెలియడంతో ఎక్కడ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోతున్నారో అన్న భయంతోనే ముఖ్యమంత్రి ఈవిధంగా అడ్డదారులు తొక్కుతున్నాడని అన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినా ఉపసంహరించుకు నేలా అభ్యర్థులను బెదిరించడం, ప్రచారానికి రాకుండా భయపెట్టడం వంటి చర్యలు జగన్ నేత్రుత్వంలో జరుగుతున్నాయని ఆరోపించారు. 

''ఏం నేరం చేశాడని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారో చెప్పాలి. గతంలో కూడా ఏ నేరం చేయకపోయినా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి 80 రోజులు జైల్లో పెట్టారు. అయినా ఆయనపై జగన్ కక్ష తీరలేదు. దివంగత ఎర్రన్నాయుడు గతంలో జగన్ అవినీతిపై హైకోర్టులో పిటిషన్ వేశారని... ఆ పిటిషన్ తోనే సీబీఐ జగన్ పై కేసులు రిజిస్టర్ చేసింది. దాంతో జగన్ 16నెలలు జైలుకు వెళ్లాడు. ఆ  కోపంతోనే నేడు ఆయన అచ్చెన్నాయుడిపై, ఆయన కుటుంబంపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు. అందుకే ఏతప్పూ చేయకపోయినా అచ్చెన్నాయుడిని 80రోజులపాటు జైల్లో వేశారు. ఇప్పుడేమో ఆయనపై 109, 120(బీ), 147, 148, 149, 188, 307 (హత్యాయత్నం), 324, 341, 384, ఐపీసీ 506 సెక్షన్లు పెట్టారు. ఇన్నికేసులు పెట్టి అరెస్ట్ చేసేంత నేరం అచ్చెన్నాయుడు ఏం చేశారు'' అని వర్ల ప్రభుత్వాన్ని నిలదీశారు. 

''డీజీపీ ప్రతిపక్షనేతలు ఫోన్లలో బెదిరిస్తున్నారని మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు డీజీపీస్థాయికి తగినట్లుగా లేవు.  ఒక రాజకీయపార్టీకి వత్తాసు పలుకుతున్నట్లుగా ఆయన మాటలున్నాయి. తప్పుచేసినవారు ఎవరూ కూడా పోలీసులను చూసి భయపడటం లేదు. తప్పుచేసినవారు, నేరస్తులు పోలీసులకు దగ్గరివారిగా మారిపోయారు. అందుకు డీజీపీ వ్యాఖ్యలే నిదర్శనం. పోలీసులు అలా వ్యవహరిస్తే, ఇక సామాన్యులకు దిక్కెవరు. అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారో డీజీపీ సమాధానం చెప్పాలి.  అచ్చెన్నాయుడు తనబంధువైన అప్పన్నను నామినేషన్ వేయవద్దు, మనదంతా ఒక కుటుంబమని చెప్పడం జరిగింది. ఆయన తన బంధువుని వేడుకోవడం బెదిరింపులకు పాల్పడటం ఎలా అవుతుందో డీజీపీ సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''అప్పన్న తనకు జరిగిన అన్యాయాన్ని అచ్చెన్నాయుడికి చెప్పుకోగా... మనమంతా ఒక్కటేనని, నీకు అన్యాయం జరిగిన విషయం నాకు తెలియదని, నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని, నిన్నుబాధ్యతగా చూసుకునే బాధ్యతనాదని అచ్చెన్న మర్యాదపూర్వకంగానే చెప్పడం జరిగింది. కింజారపు అప్పన్నతో కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడిన దానిలో బెదిరింపులు ఎక్కడున్నాయో డీజీపీ చెప్పాలి. పది మర్డర్లు చేసినవాడిని తీసుకెళ్లినట్లు అచ్చెన్నాయుడిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు? ఏపీలో పోలీస్ శాఖ పారదర్శకంగా పనిచేస్తుందని ప్రజలు భావించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? తన ఇంటిపేరుతో ఉన్న అప్పన్నను మనలో మనకు అభిప్రాయబేధాలు ఎందుకురా అని అచ్చెన్నాయుడు మాట్లాడటం తప్పెలా అవుతుందో డీజీపీ సమాధానం చెప్పాలి'' అని అడిగారు. 

read more నేను హోం మంత్రిని అవుతా, అప్పుడు చెప్తా: పోలీసులపై అచ్చెన్నాయుడు

''అప్పన్నతో అచ్చెన్నాయుడు మాట్లాడింది తప్పయితే మరి దువ్వాడ శ్రీనివాస్ అనే వైసీపీనేత అచ్చెన్నాయుడి కారుపై దాడి చేసి, టీడీపీనేతను నానారకాలుగా ప్రజలమధ్యనే దూషించడాన్ని ఏమనాలో డీజీపీ చెప్పాలి. నరికేద్దాం, చంపేద్దాం, లంజకొడుకులను పరుగులు పెట్టిద్దామని అనడం, మారణాయుధ లు, అనుచరులతో  పట్టపగలే నడిరోడ్డుపై నడుస్తూ అచ్చెన్నాయుడిపై ఇంటిపైకి దాడికి వెళ్లడం జరిగింది.   ఇంతటి ఘోరం నేరము అవుతుందో కాదో డీజీపీ చెప్పాలి.  ఇంతటి దారుణం జరిగితే దువ్వాడపై పోలీసులు ఒక్కటంటే ఒక్కకేసుకూడా పెట్టలేదు. ఇద్దరు న్యాయవాదులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి దువ్వాడ వీరంగంపై, బూతుల పురాణంపై ఫిర్యాదు చేస్తామంటే అక్కడున్న పోలీసులు వారి ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో సదరు న్యాయవాదులు విధిలేక తమ ఫిర్యాదును మెయిల్ చేశారు. అయినా కూడా దువ్వాడపై  ఎటువంటి కేసుని పోలీసులు నమోదు చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు, మారణాయుధాలతో దాడికి వెళ్లడంచేసినా అతనిపై ఎందుకు కేసులు నమోదుచేయలేదు. అతని తీరు అరాచకాన్ని గుర్తుకుచేస్తున్నా, దువ్వాడ మాట్లాడుతున్నప్పుడు పోలీసులు పక్కనేఉన్నా, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. దువ్వాడ శ్రీని వాస్ ను అరెస్ట్ చేయలేని డీజీపీ ఏ రకంగా రాష్ట్రంలో శాంతిభద్రత లు కాపాడతాడో ప్రజలకు సమాధానం చెప్పాలి'' అన్నారు.


''వైసీపీ నేతలు పోలీసులను తిడుతున్నా, కొడుతున్నా కూడా వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దువ్వాడ అంతటి అరాచకం చేస్తే అతనిపై కేసుపెట్టకుండా, తనబంధువైన అప్పన్నతో మర్యాదగా మాట్లాడిన అచ్చెన్నాయుడిపై లెక్కకుమిక్కిలి కేసులు పెట్టడం ఏమిటి. గతంలో రోజా ఒక సీఐని ఉద్దేశించి పదిలక్షలు తీసుకున్నాడంటూ, నడిరోడ్డుపై అతన్ని బూతులు మాట్లాడితే, ఆమెపై ఎటువంటి కేసుపెట్టని పోలీసులు టీడీపీనేత యరపతినేని శ్రీనివాసరావు ఏదో ఒక చిన్నమాటంటే, అతనిపై ఎఫ్ఐఆర్ కట్టేంత హడావుడి చేశారు. వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి ఐపీసీ ఎందుకు మూగబోతోందో డీజీపీ చెప్పాలి. చట్టాలు వైసీపీ నేతలకు వర్తించవా? ఈ డీజీపీ వచ్చాక రాష్ట్రంలో చట్టాలు మారిపోయాయా?'' అన్నారు. 

''బహిరంగంగా నేరంచేసిన దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యే రోజా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చీరాల వైసీపీనేత ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పై ఎందుకు కేసులు పెట్టలేదు? అచ్చెన్నాయుడిపై అన్నిసెక్షన్లు మోపి, అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ నేతలను, ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్  చేయడం లేదు? మండపేటలో మహిళా సీఐ సమక్షంలో పోలీసులను కుక్కలతో పోల్చిన వైసీపీనేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? జిల్లా అధికారివా... టీడీపీ ఏజెంటువా అంటూ నెల్లూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు డీజిపీకి కనిపించలేదా?   డీజీపీ పని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడుచుకోవడమేనా? అచ్చెన్నాయుడి మాటలు బెదిరింపుల్లా కనపడితే, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల మాటలు డీజీపీకి ఎలా కనిపిస్తున్నాయి. డీజీపీ ఇలా వ్యవహరిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపగలరా?'' అని నిలదీశారు. 

''అచ్చెన్నాయుడి అరెస్ట్ తో , టీడీపీ కార్యకర్తలను, టీడీపీ సానుభూతిపరులను బెదిరించాలనే దురాలోచనతోనే ప్రభుత్వం ఈ దురాగతానికి ఒడిగట్టింది. అచ్చెన్నాయుడి వ్యాఖ్యల్లో ఎటువంటి నేరముందో డీజీపీ చెప్పాలి. రాష్ట్ర పోలీస్ శాఖ ఎటుపోతోందో డీజీపీ ఆలోచన చేయాలి. ఇప్పటికైనా పోలీసులకు, డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే అచ్చెన్నాయుడిపై పెట్టిన కేసుల గురించి పునరాలోచించాలి. ఆయన అరెస్ట్ ని , రిమాండ్ రిపోర్ట్ ని వెనక్కు తీసుకొని,  జరిగిన ఘటనపై నిజాయితీగా విచారణ జరపాలి.  అచ్చె న్నాయుడిపై తప్పుడుకేసులు పెట్టిన పోలీస్ అధికారులను తక్షణమే బదిలీచేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఒంటినిండా అవినీతి బురద పెట్టుకున్న బుడత మాస్టర్ విజయసాయిరెడ్డి,  ఏ ముఖం పెట్టుకొని నిమ్మాడకు వెళుతున్నారు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి, బెయిల్ పై బయట తిరుగుతున్న ఏ2 నిమ్మాడకు ఎందుకు వెళుతున్నాడని డీజీపీ అడగరా? బైండోవర్ చేసి, పోలీసుల కస్టడీలో ఉండేంత చరిత్ర కలిగిన విజయసాయిరెడ్డిని యథేచ్ఛగా నిమ్మాడకు ఎలా అనుమతిస్తారు?  విజయసాయిని  అనుమతించడం పోలీసుల పక్షపాత వైఖరికి సంకేతం కాదా?  నేరచరిత్ర, అసహ్యమైన అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తి నిమ్మాడకు వెళుతుంటే, అతన్ని బైండోవర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ఎంపీ అయితే పాతనేరస్తుడిని బైండోవర్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? విజయసాయి రామతీర్థం వెళ్లబట్టే కదా గతంలో డీజీపీ  తలదించుకున్నారు. డీజీపీ వ్యవహారశైలినిని రాజ్యాంగవ్యవస్థలన్నీ చూస్తూనే ఉన్నాయి. టీడీపీ నేతలను బెదిరించి, ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలనే ఆలోచనతోనే విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, దౌర్జన్యాలుచేసినా, పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నా స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం'' అని వర్ల హెచ్చరించారు. 

''ప్రభుత్వ అవినీతిని, పాలకుల దుర్మార్గాలను ప్రశ్నిస్తే టీడీపీనేత పట్టాభిపై దాడిచేస్తారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.. అరాచకపాలనలో ఉన్నామా? ప్రశాంతమైన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితిని  తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని, అతనికి కొమ్ముకాస్తున్న డీజీపీని చూస్తూనే ఉన్నాం. టీడీపీ నాయకత్వాన్ని అణచివేయడం కోసమే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. పట్టాభిపై దాడిచేశారు. డీజీపీ ఇప్పటికైనా మారి పారదర్శకతతో పోలీసులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. టెక్కలి డీఎస్పీని, అక్కడి సీఐని తక్షణమే తొలగించాలని.. అచ్చెన్నాయుడి వ్యవహారంపై సీనియర్ అధికారితో విచారణ జరిపించాలి'' అని వర్ల  డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios