పెగాసస్ స్పై వేర్ వాడి వ్యక్తుల వ్యక్తిగత డాటాను సేకరించినట్లు గత టిడిపి ప్రభుత్వంపై ఆరోపణలు రావడంంతో ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటుచేసింది.ఇవాళ ఈ కమిటీ సమావేశమయ్యింది.

అమరావతి: గత టిడిపి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ (pegasus spyware) వాడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వుండగా ఈ స్పై వేర్ ను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ఇలా కేవలం ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో పెగాసస్ స్పై వేరే వాడకంపై దుమారం రేగడంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హౌస్ కమిటీని ఏర్పాటుచేసారు. 

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ హౌస్ కమిటీ ఇవాళ(బుధవారం) సమావేశమయ్యింది. రాష్ట్ర పౌరుల వ్యక్తిగత డాటాను చోరీ వ్యవహారంలో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖతో పాటు వివిధ శాఖల అధికారుల అధికారులతో హౌస్ కమిటీ సమావేశమయ్యింది. 

ఈ సమావేశం అనంతరం హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన మాట్లాడుతూ... కేవలం పెగసస్ అంశమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అవకతవకలపై హౌస్ కమిటీ విచారణ చేస్తోందన్నారు. ఇందుకోసం వచ్చే నెల 5 ,6 తేదీల్లో మరోసారి హౌస్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. మూడు నెలల్లోనే దీనిపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. 

''గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసింది. ఇదే విషయాన్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పదేపదే చెప్పింది. ఇక పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చంద్రబాబు హయంలో డేటా చౌర్యం జరిగిందని చెప్పారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసింది. ఇలా వ్యక్తుల ప్రైవేట్ భద్రత భంగం కలిగించడంపై వైసిపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అందువల్లే హౌస్ కమిటీ ఏర్పాటు జరిగింది'' అని భూమన తెలిపారు.

''అప్రజాస్వామిక ధోరణితో గత ప్రభుత్వం వ్యవహరించింది. డాటా చోరీ వ్యవహరంపై త్వరగా విచారణ పూర్తి చేసి దోషులను ప్రజల ముందు నిలబెడతాం. ఈ వ్యవహారంతో సంబంధమున్న వివిధ శాఖల అధికారులను విచారించనున్నాం'' అని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన తెలిపారు. 

పెగాసెస్‌ స్పై వేర్ మరియు డాటా చౌర్యం వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ ఏర్పాటుచేసిన హౌస్‌ కమిటీకి చైర్మన్‌గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులుగా మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారథి, మద్దాల గిరిధర్‌లు ఉన్నారు.