తిరుపతి: ఎన్ఎంసి బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లను కాళ్లతో తన్నిన వీజీవో అశోక్ కుమార్ గౌడ్ మీద వేటుపడింది. ఇటీవల అలిపిరి వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను అతను కాలితో తన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. 

అశోక్ కుమార్ గౌడ్ ను ప్రభుత్వం వీఆర్ కి పంపించింది. ఎన్ఎంసి బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా జూనియర్ డాక్టర్లు ఇటీవల తిరమలలోని అలిపిరిలోని తనిఖీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. 

జూనియర్ డాక్టర్ల ఆందోళనతో తిరుమలకు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు జూనియర్ డాక్టర్లతో వాగ్వివాదానికి దిగారు. భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని టీటీడీ జెఈవో ధర్మారెడ్డి కోరినా జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గలేదు.

జూనియర్ డాక్టర్లు ఆందోళనను తీవ్రతరం చేసిన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన వీజీవో అశోక్ కుమార్ గౌడ్ జూనియర్ డాక్టర్లను కాలితో తన్నాడు.