మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రస్ట్ కి సంచయిత ఛైర్ పర్సన్ గా నియమితులైన నాటి నుంచి.. వారి కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. ఆ కుటుంబ వివాదాలు కాస్త రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. అప్పటి నుంచి సంచయిత, అశోక్ గజపతి రాజుల మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంది. కాగా.. తాజాగా.. సంచయిత కి అశోక్ గజపతి రాజు కౌంటర్ ఇచ్చారు.

చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్టు చేశారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ. ఒక్కోచోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను నేనెక్కడా చూడలేదు.’ అని అన్నారు.

 ‘తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరం. మాన్సాస్ ఛైర్మన్ హోదా అన్నది ప్రభుత్వం కల్పించిన పదవి కాదు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరించింది. ఆనవాయితీలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నదీ ప్రభుత్వం నిర్ణయించే ధోరణి భయంకరం. ఆదాయం, ఆస్తి ఉన్న ఆలయాలపై ప్రభుత్వం కన్నేయటం బాధాకరం. దేవాదాయ శాఖ చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదు’ అని గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.