150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్‌ ట్రస్టు బోర్డు చైర్‌ పర్సన్‌ సంచయిత గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

మీరు చైర్మన్‌గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అప్పుడు  ‘‘సేవ్‌ మన్సాస్‌’’ ఉద్యమం చేయాల్సింది. సరైన ఆడిటింగ్‌ నిర్వహించక, మాన్యువల్‌గా తప్పుడుతడకలుగా ఆడిటింగ్‌ చేయించినపుడు ఉద్యమం ప్రారంభిస్తే అసలు రంగు బయటపడేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్సాస్‌కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులు రాబట్టుకోలేదు. అప్పుడు సేవ్‌ మన్సాస్‌ అంటే కొంతైనా ప్రయోజనం ఉండేది. 

 ‘‘8 వేల ఎకరాల మన్సాస్‌ భూములను ఎకరా 5 వందల రూపాయలకు మీ అనునాయులకు లీజుకి కట్టబెట్టినపుడు నిజానికి సేవ్‌ మన్సాస్‌ ఉద్యమాన్ని చేయాల్సింది. మార్కెట్‌ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా? కనీసం లాయర్‌ను పెట్టుకోవడం కూడా చేతకాక రూ. 13 కోట్ల నష్టాన్ని కలిగించే విధంగా, మన్సాస్‌ భూములు ఎక్స్‌పార్టీ  డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనపుడు మీ ఉద్యమం ప్రారంభించాల్సింది. 2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మన్సాస్‌ విద్యాసంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అప్పుడు మొదలు పెట్టాల్సింది ఈ క్యాంపెయిన్‌. 

అశోక్‌ గారూ.. మీరు ఎంఆర్‌ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు చైర్మన్‌గా ఉన్నపుడే ఇది ఒక ప్రైవేట్‌ కాలేజీ, గవర్నమెంటు ఎయిడ్‌ ను మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది’’ అంటూ అశోక్‌ గజపతిరాజు తీరును ఎండగట్టారు. వాస్తవానికి తానే సేవ్‌ మన్సాస్‌ ఉద్యమం నడుపుతున్నానని, ట్రస్టు పూర్వవైభవాన్ని పునురుద్ధరిస్తానన్న సంచయిత.. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ అశోక్‌ గజపతిరాజుకు హితవు పలికారు. సేవ్‌ మన్సాస్‌ పేరుతో చేస్తున్నది ‘‘సేవ్‌ అశోక్‌’’ క్యాంపెయిన్‌ మాత్రమేనంటూ చురకలు అంటించారు.