ఎన్నికల్లో దారుణ ఓటమితో టీడీపీ నేతలు నిరాశలో కూరుకుపోయారు. ఈ క్రమంలో ఓటమిపై విశ్లేషణ కోసం విజయవాడలో జరుగుతున్న పార్టీ వర్క్‌షాపులో నేతలు టీడీపీ పెద్దలపై గళమెత్తారు. ఎన్నికల సమయంలో పార్టీ పెద్దల తప్పులను ఎత్తిచూపుతూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు.. అధినేత బాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన టెలీకాన్ఫరెన్సులను అశోక్ తప్పుబట్టారు.

వేల మందితో కాన్ఫరెన్సుల వల్ల  వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. మరోనేత జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్టీలో హ్యూమన్ టచ్ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

పార్టీ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విషయాన్ని పెద్దలు గుర్తించలేదన్నారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ నివేదికలే కొంపముంచాయని ఎమ్మెల్యే గౌరవాన్ని శ్రీనివాసులు ఆరోపించారు. గతంలోనూ, ఇప్పుడు అధికారులను పక్కనబెట్టుకోవడం వల్లే ఓటమి పాలయ్యామన్నారు.

కోడెల కుటుంబ అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. గ్రామస్థాయి నేతల అవినీతిపై అధినేతకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని ఆమె తెలిపారు

చంద్రబాబు చుట్టూ చేరిన బృందం అధినేతకు వాస్తవాలు తెలియకుండా చేశారన్నారు. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుదామని అనంత నేతలు బాబుకు తెలిపారు. ఇప్పుడు కనుక కలిసి లేకపోతే మరింత నష్టం జరుగుతుందని నేతలు అధినేతకు వెల్లడించారు.

మరోవైపు ఈ వర్క్‌షాపులో గుంటూరు జిల్లా నేతలతో కలిసి వేదిక కిందే కూర్చున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్. పార్టీ లీగల్ వింగ్‌ను పటిష్టపరచాలని ఎమ్మెల్యసీ బీద రవిచంద్ర అధిష్టానానికి సూచించారు. వైసీపీ పెడుతున్న కేసులు, బిల్లుల చెల్లింపు వంటి అంశాల్లో పార్టీ నేతలకు లీగల్ సెల్ ద్వారా అండగా నిలవాలని రవీంద్ర తెలిపారు.