విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకు ఎలాంటి విబేధాలు లేవని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో ఓ ఛానెల్ తో మాట్లాడిన ఆయన ప్రయాణం కుదరకపోవడం వల్లే సమావేశాలకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. 

భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు ప్రయాణం సహకరించలేదని అలాగే, టీడీపొ పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా ప్రయాణం సహకరించకపోవడం వల్లే హాజరుకాలేకపోయానని తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఉన్నానని కొనసాగుతానని తెలిపారు.

ఒకవేళ పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి టీ కప్పులో తుఫాన్ లాంటివేనని కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కూడా ఏమీ ఉండవని పార్టీ బలంగా ఉందని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. 

ఇకపోతే కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై అలకబూనారని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, విజయనగరం జిల్లాకు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా తనను సంప్రదించుకుండా పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 

గతంలో కురుపాంకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న అంశం కానీ, శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సందర్భంలో కానీ చంద్రబాబు తనను సంప్రదించలేదని చెప్పుకొచ్చారట. 

అలాగే అరకు మాజీ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై కనీసం మాట వరసకు అయినా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. 

అందువల్లే ఆయన పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రవాణా సౌకర్యం కుదరకపోవడం వల్లే సమావేశాలకు హాజరుకాలేదని చెప్పడం వెనుక కారణం కూడా అలకేనని ప్రచారం జరుగుతోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుపై అలక: టీడీపి భేటీకి అశోక్ గజపతి రాజు డుమ్మా