అమరావతి: కేంద్ర మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ పోలిట్ బ్యూరో. పైగా చాలా రోజుల తర్వాత టీడీపి పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ స్థితిలో ఆయన ఆ సమావేశానికి హాజరు కాకపోవడంపై కారణాలను చర్చిస్తున్నారు. 

చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి అశోక్‌గజపతి రాజు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. 

పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా చెబుతున్నారు. తన పార్లమెంట్‌ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్‌గజపతి రాజు రాకపోవడానికి కూడా కారణం అదేనని అంటున్నారు.

కిశోర్‌ చంద్రదేవ్‌ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమని అంటున్నారు. కిశోర్‌ చంద్రదేవ్‌ను టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే కిశోర్ చంద్రదేవ్ చంద్రబాబుతో ఇటీవల భేటీ అయ్యారు. 

కిశోర్ చంద్రదేవ్ వ్యవహారంపై తనతో చర్చించకపోవడాన్ని కూడా అశోక్ గజపతిరాజు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల రీత్యా ఆయన పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు.