అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పి. అశోక్ గజపతిరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి వ్యంగ్యాస్త్రం విసిరారు. పవన్ కళ్యాణ్ తనకు తెలియదని మరోసారి ఆయన అన్నారు. తాను సినిమాలు చూడనని, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసునని ఆయన అన్నారు.

ఆదివారం అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా తనకు తెలుసునని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం తన వద్దకు వస్తే చేసిపెట్టినట్లు ఆయన తెలిపారు. 

పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతిరాజు అప్పట్లో గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాంతో జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. మీ పార్టీని గెలవడానికి కీలకపాత్ర పోషించిన పవన్ గురించి తెలియకపోవడమేమిటని వారు ప్రశ్నించారు.