బెంగళూరులో 'తెలుగు' రాజకీయం: అశోక్ బాబు సమావేశంలో గొడవ

Ashok Babu meeting with Telugu association creates havoc in Bengaluru
Highlights

తెలుగు సంఘం పేర కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. 

బెంగళూరు: తెలుగు సంఘం పేర కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. బెంగళూరులోని ఓ హోటల్లో ఎపిఎన్జీవోల సంఘం నేత అశోక్ బాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి చంద్రబాబు సూచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు సంఘాల పేర తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులు సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమావేశం జరుగుతున్న హోటల్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు కూడా వచ్చారు. దాంతో అక్కడ గొడవ చోటు చేసుకుంది.

తెలుగు సంఘాల పేర సమావేశం పెట్టడం వల్ల తాము వచ్చామని ప్రత్యర్థివర్గానికి చెందినవారు గొడవకు దిగారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగువారు అని చెబుకుని సమావేశం ఏర్పాటు చేసుకుని ఉంటే తాము వచ్చేవాళ్లం కాదని అన్నారు. 

మీరు విడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సింది చెప్పాలని సమావేశ నిర్వాహకులు చెప్పినా వారు వినలేదు. తాము అడిగే ప్రశ్న ఒక్కటి ఉందని, అది అడుగుతామని వారు మొండికేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసుకు ఓటు వేయాలని ఎలా అడుగుతారని అన్నారు.

తమకు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తాము పార్టీలకు అతీతంగా కర్ణాటక ప్రజలతో సోదరభావంతో మెలుగుతున్నామని, ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం వల్ల సామరస్యం దెబ్బ తింటుందని కొందరు వాదించారు. తమకు కూడా చర్చలో భాగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

వైసిపి వాళ్లు వస్తే గొడవ అవుతుందని, అందుకే తాము అనుమతించడం లేదని సమావేశానికి వచ్చిన కొందర వాదించారు. అయినా వారు వినలేదు. టీడిపి సమావేశం అని చెప్పి ఉంటే తాము వచ్చేవాళ్లం కాదని అన్నారు. 

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనకుండా ఇక్కడికి వచ్చి మీరు చెప్పదలుచుకున్నదేమిటని కొందరు అశోక్ బాబును నిలదీశారు. 

మోడీ ఇజంకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉందని, రాజకీయ నేతలకు చెక్ పెట్టడమంటే ఓడించడమేనని అశోక్ బాబు సమావేశానంతరం మీడియాతో అన్ారు. అసలు 2014 ఎన్నికల్లో టీడిపితో పొత్తు పెట్టుకోవడం వల్ల బిజెపి బతికిపోయిందని ఆయన వ్యాఖ్యానిచారు. 

నాలుగేళ్ల పాటు టీడిపి బిజెపితో కలిసే ఉంది కదా, మరి ఎపిలో కాలయాపన ఎందుకు చేశారని మీడియా అడిగితే పదేళ్ల సమయం ఉందని, ఆరాటం వద్దని బిజెపి వాళ్లే చెప్పారని, కాబట్టే ఎపి హక్కుల విషయంలో తాము మౌనంగా ఉన్నామని, హక్కుల పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరని అశోక్ బాబు సమాధానమిచ్చారు. 

loader