అనారోగ్యంతో గర్భిణీ అయిన భార్య మృతి చెందడాన్ని ఓ ఆర్మీ జవాన్ తట్టుకోలేకపోయాడు. మూడు రోజులకే తాను కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

శ్రీకాకుళం : భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో విషాదం నింపింది. ఆర్మీ జవాన్ అయిన మంగరాజు రాజబాబు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్ల పేట గ్రామానికి చెందిన మంగరాజు రాజబాబుకి 2016లో ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆరేళ్ళకి 2022లో ఈసర్లపేట గ్రామానికే చెందిన మౌనికతో వివాహం జరిగింది.

ప్రస్తుతం రాజబాబు హర్యానాలో విధుల్లో ఉన్నాడు. రాజబాబు భార్య మౌనిక ఏడు నెలల గర్భిణీ. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో రాజబాబు తండ్రి కోడలిని వైజాగ్ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె అనారోగ్యం సంగతి కొడుకుకు సమాచారం ఇచ్చాడు. రాజబాబు సెలవు మీద హర్యానా నుంచి వైజాగ్ కు వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఈనెల 16వ తేదీన మౌనిక మృతి చెందింది.

రెప్పపాటులో మహిళ మెడలో బంగారంతో మాయం... అనంతపురం చైన్ స్నాచింగ్ వీడియో వైరల్

భార్య ఇలా హఠాత్తుగా మరణించడాన్ని రాజబాబు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెనే తలచుకుంటూ భోజనం కూడా చేసేవాడు కాదు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దానికి తోడు మానసిక వేదనతో కృంగిపోయాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 19వ తేదీన తన ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అలా బయటికి వచ్చిన రాజబాబు ఆముదాలవలసకు వెళ్ళాడు. అక్కడ రైలెక్కి పొందూరు చేరుకున్నాడు.

ఆ తర్వాత స్నేహితులకు ఓ మెసేజ్ చేశాడు. తాను పొందూరులో ఉన్నానని.. చనిపోబోతున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పొందూరు పోలీసులకు సమాచారం అందించారు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు పొందూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వెతికారు. చాలాసేపటి తర్వాత కొంచాడ దగ్గర ఉన్న ఓ తోటలో రాజబాబు ఉరివేసుకుని కనిపించాడు. కోడలు చనిపోయిన నాలుగు రోజులకు కొడుకు బలవన్మరణం పాలవడం.. ఇంట్లో వెంట వెంటనే మరణాలతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.