గుంటూరు:  ప్రియురాలి తల్లిపై కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి ఆదివారం నాడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   బాలాజీ కుటుంబసభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు.

గుంటూరు జిల్లా  చెరుకుపల్లి మండలం నడింపల్లి వద్ద శనివారం నాడు ఓ మహిళపై ఆర్మీ ఉద్యోగి బాలాజీ తపంచాతో కాల్పులకు దిగాడు. కాల్పుల్లో  ఆ మహిళ గాయపడింది. మహిళ కూతురితో బాలాజీ ప్రేమిస్తున్నాడు. అయతే తమ మధ్య ప్రియురాలి తల్లి అడ్డంకిగా ఉందని భావించిన  బాలాజీ ఆమెపై కాల్పులకు దిగాడు. 

Also read:గుంటూరులో ప్రియురాలి తల్లిపై కాల్పులు: ఆర్మీ జవాన్‌ బాలాజీ ఆత్మహత్య

మహిళపై కాల్పులకు దిగిన బాలాజీ కోసం పోలీసులు శనివారం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నాడు ఉదయం తెనాలికి సమీపంలో బాలాజీ మృతదేహం రైల్వే పట్టాలపై కన్పించింది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహం వద్ద దొరికిన గుర్తింపు కార్డుతో పాటు ఇతర ఆధారాలను బట్టి చనిపోయింది  బాలాజీగా పోలీసులు అనుమానించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారంగా చనిపోయిన వ్యక్తి బాలాజీగానే ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

మృతుడి కుటుంబసభ్యులను తెనాలి రైల్వేస్టేషన్ వద్దకు రావాలని పోలీసులు సమాచారం పంపారు.గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన సైనిక ఉద్యోగి బాలాజీ నడంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ యువతి కుటుంబసభ్యులు మాత్రం ఈ పెళ్లికి అంగీకరించలేదు

అతను ఆ యువతి వెంట పడుతున్నాడు. దీంతో బాధిత కుటుంబం బాలాజీపై కొద్దిరోజుల క్రితం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన ప్రేమను ఒప్పుకోకపోగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ప్రియురాలి తల్లిపై తపంచాతో కాల్పులకు దిగాడు. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన ఆమె తలుపు పక్కకు దాక్కుంది. దీంతో ఆమె చెవికి స్వల్పంగా గాయమైంది.

తీవ్ర భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే పరుగున వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.  బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు.ఆదివారం నాడు ఉదయం బాలాజీ తెనాలికి సమీపంలోని రైలు పట్టాలపై మృతదేహం కన్పించింది.