Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించే పరిస్థితి లేకుండా నిధులు మళ్లించేశారా?

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో డయేరియా ప్రబలుతోంది. గ్రామాలు, పట్టణాలన్న తేడా లేకుండా కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడి.. ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయా శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.  

Are the funds diverted without the provision of clean drinking water in AP? GVR
Author
First Published Jun 21, 2024, 9:50 PM IST

ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించే పరిస్థితి లేకుండా నిధులు మళ్లించేశారా అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అధికారులను ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణులకు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల భయం లేకుండా చూడాలని.. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా ప్రబలడంతో రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా అధికారులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు ఓ సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి ఏటా వర్షా కాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయని, వారి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి కాలుష్యం మూలంగానే డయేరియా, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని... శుద్ధమైన జలం అందించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి గ్రామాల్లో అతిసారం కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో డయేరియా ప్రబలింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ స్పష్ట్ చేశారు. 

కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని గత ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ద్వారా మళ్లించేయడంతో గ్రామాల్లో రక్షిత తాగునీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో గుర్తించారు. స్థానిక సంస్థల నిధులు, ఆదాయాన్ని గత అయిదేళ్లలో మళ్లించడంపై అధికారులను ప్రశ్నించి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఆర్థిక సంవత్సరం, ఎంత మేర నిధులను మళ్లించారనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. 

నీటి కాలుష్యాన్ని గుర్తించాం... 
గ్రామాల్లో ప్రతి బుధవారం కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా తాగు నీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తున్నారో అక్కడ శాంపిళ్లు తీసి పరీక్షించే వ్యవస్థ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పవన్ కల్యాణ్ కు తెలిపారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో 10,047 శాంపిళ్లు తీస్తే 217 శాంపిళ్లలో బాక్టీరియా వల్ల కలుషితమైనట్లు గుర్తించామని చెప్పారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్... సదరు వాటర్ సోర్సెస్ వద్ద నుంచి సరఫరా ఆపివేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల అంశంతోపాటు, ఇటీవల విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ, తాగునీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడిన ఘటనలపై మంత్రులు అధికారుల వివరణ కోరారు. తాగు నీటి పైపు లైన్లలో డ్రైనేజీ నీరు కలసిపోతుండటంతో నగరాలు, పట్టణాల్లో అతిసారం కేసులు నమోదవుతున్నాయని గుర్తించినట్లు అధికారులు వివరించారు. 

మూడు శాఖలు కలసి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల ముందుగానే పసిగట్టి, వాటిని నివారించేలా అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సదా సిద్ధంగా ఉండాలని, పంచాయతీరాజ్, పురపాలక అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే సీజన్ లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ప్రజల్లో సైతం వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, నీటిని కాచి తాగడం గురించి ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios