ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివరాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఏపీలో మొత్తం 441 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 పట్టణాలు/నగరాల్లోని 291 పరీక్షా కేంద్రాలలో ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించినట్టుగా ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది. మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా తెలిపింది. జెండర్ వైజ్, కమ్యూనిటీ వైస్.. పరీక్షకు హాజరైన, అర్హత సాధించిన వారి గణంకాలను కూడా వెల్లడించింది.
ఈ పరీక్షలో అర్హత మార్కులు.. ఓసీలకు ప్రతి పేపర్‌లో 40 శాతం, బీసీలకు ప్రతి పేపర్‌లో 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ప్రతి పేపర్‌లో 30 శాతం నిర్ణయించినట్టుగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేసినట్టుగా పేర్కొంది. మొత్తం 1,553 అభ్యంతరాలు వచ్చినట్టుగా తెలిపింది. సబ్జెక్ట్ నిపుణులు ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించారని పేర్కొంది. పేపర్ 1కి సంబంధించిన ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు లేవని.. అయితే 2వ పేపర్‌లో ఒక ప్రశ్నకు మల్టీపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయని.. ఫైనల్ ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టుగా వెల్లడించింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ స్కానింగ్ కాపీ.. మార్చి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీనిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తదుపరి అప్‌డేట్స్ కోసం https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌ని తరచుగా సందర్శించవలసిందిగా అభ్యర్థించింది. దేహదారుఢ్య పరీక్షలు (స్టేజ్ II ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ) కోసం రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపింది.
