త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు ఉండదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తాము ఒంటరిగానే పోటి చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

ఫలితాల తర్వాత కాంగ్రెస్ కింగ్ మేకర్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఎన్నికల్లో మెగాస్టార్ ప్రచారం చేస్తారని రఘువీరా స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేనకు ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.

వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే కేసీఆర్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. రాహుల్‌ను ఎదుర్కొనే సత్తా ప్రధాని మోడీకి లేదని... ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి రావడంతో మోడీ భయం మరింత ఎక్కువైందని ఆరోపించారు. మాజీ సీఎం కిరణ్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.