సారాంశం

అమరావతి ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై  స్టే తీసుకు వచ్చిన విషయమై టీడీపీపై  ఏపీ‌ఎఫ్‌డీసీ  చైర్మెన్ పోసాని కృష్ణమురళి  మండిపడ్డారు.

అమరావతి: జగన్ పాలన బాగా లేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని  ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణమురళి  చెప్పారు.శుక్రవారంనాడు  హైద్రాబాద్ లో  ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్  పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు.  అమరావతి భూములపై  చంద్రబాబు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారన్నారు.  చంద్రబాబుకు అసలు సిగ్గుందా అని ఆయన  ప్రశ్నించారు.

 వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు  రైతులకు రుణమాఫీ చేశారన్నారు.  సుమారు రూ.11 వేల కోట్లను రుణ మాఫీ చేశారని ఆయన గుర్తు  చేశారు. ఆనాడు  వైఎస్ఆర్ రుణమాఫీపై ఎందుకు  స్టే తీసుకు రాలేదా అని  పోసాని  కృష్ణమురళి ప్రశ్నించారు.  అమరావతి మీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని  స్టే తీసుకు రాలేదా అని చంద్రబాబును  ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి.  అంతేకాదు  రైతులకు  ఉచితంగా  విద్యుత్ ను  వైఎస్ఆర్  సర్కార్ ఇచ్చిన సమయంలో ఎందుకు  కోర్టుకు వెళ్లలేదని ఆయన  అడిగారు.

also read:చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో చెప్పాలి: పవన్ పై పోసాని ఫైర్

అమరావతిలోని ఆర్-5 జోన్ లో పేదలకు  జగన్ సర్కార్  ఇళ్లు కట్టిస్తాననంటే  స్టే తీసుకువచ్చినట్టుగా బాబు చెప్పడంపై  పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. అమరావతిలో  పేదలకు ఇళ్లు కట్టకుండా స్టే తీసుకువచ్చిన రైతులపై ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు. తాను కమ్మ సామాజిక వర్గంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నట్టుగా పోసాని  కృష్ణ మురళి  చెప్పారు.

తుళ్లూరు గుండా  వైఎస్ జగన్ వెళ్తే  అమరావతి రైతులు  పసుపు నీళ్లు చల్లిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. బషీర్ బాగ్ లో చంద్రబాబు కాల్పులు జరిపించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  ఆ సమయంలో ఎందుకు  పసుపు నీళ్లు చల్లలేదో చెప్పాలన్నారు. 

సింగపూర్ మంత్రి ఈశ్వర్ ఓ దొంగ అని ఆయన  ఆరోపించారు.  అలాంటి దొంగను తీసుకువచ్చి చంద్రబాబు డ్రామాలు ఆడారన్నారు. ఏపీ సీఎం జగన్ ను నోటికొచ్చినట్టుగా మాట్లాడడం సరైంది కాదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో  రైతుల ఆత్మహత్యలపై  ఎందుకు  మాట్లాడరని ఆయన  ప్రశ్నించారు. చంద్రబాబు మాట వింటే సర్వనాశనమౌతారని ఆయన  రైతులకు హితవు పలికారు.  

ఎన్నో పాపాలు చేసిన చంద్రబాబు కుళ్లి కుళ్లి చనిపోతారన్నారు.  జగన్  మంచి పనులు చేసి  ప్రజల మన్ననలు పొందితే తనకు, తన కొడుకుకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. అందుకే రైతులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని పోసాని కృష్ణమురళి విమర్శించారు. ప్రజా న్యాయస్థానంలో  సీఎం జగన్  151 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించారన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడి గురించి మాట్లాడడం వేస్టన్నారు.