న్యూఢిల్లీ: ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తెలిపారు. ఇకపోతే దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఏపీసీసీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసినట్లు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాజీనామా చేశానని తెలిపారు. మే 19న పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. 

పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కమిటీలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ.  

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో కాంగ్రెస్‌కు షాక్: పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా